మళ్లీ నిలుపుదల!

– రెజ్లింగ్‌ సమాఖ్య ఎన్నికలపై
– పంజాబ్‌, హర్యానా హైకోర్టు స్టే
నవతెలంగాణ-న్యూఢిల్లీ
మల్లయోధులు సహా భారత క్రీడా రంగంలో అత్యంత ఆసక్తి రేకెత్తించిన భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) ఎన్నికలు మరోసారి వాయిదా పడ్డాయి. హర్యానా రెజ్లింగ్‌ సంఘం (హెచ్‌డబ్ల్యూఏ) దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ది పంజాబ్‌, హర్యానా హైకోర్టు ఈ మేరకు భారత రెజ్లింగ్‌ సమాఖ్యకు ఆగస్టు 12న (నేడు) జరగాల్సిన ఎన్నికలను నిలుపుదల చేస్తూ ఆదేశించింది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన డబ్ల్యూఎఫ్‌ఐ ఎన్నికలు.. తాజాగా న్యాయస్థానం స్టే ఆర్డర్‌తో మరోసారి వాయిదా పడింది. గతంలో గువహటి హైకోర్టు జులై 11న జరగాల్సిన ఎన్నికలపై స్టే విధంచగా.. సుప్రీంకోర్టు నిలుపుదల ఆదేశాలపై స్టే ఇచ్చి ఎన్నికల ప్రక్రియకు లైన్‌ క్లియర్‌ చేసిన సంగతి తెలిసిందే.
స్టే ఎందుకంటే? : హర్యానాలో రెజ్లింగ్‌పై రెండు వర్గాలు పోటీపడుతున్నాయి. హర్యానా రెజ్లింగ్‌ సంఘానికి ఎంపీ దీపేందర్‌ హుడా అధ్యక్షుడిగా కొనసాగుతుండగా.. హర్యానా అమేచర్‌ రెజ్లింగ్‌ సంఘం పేరిట మరో అసోసియేషన్‌ సైతం ఉంది. డబ్ల్యూఎఫ్‌ఐతో పాటు హర్యానా ఒలింపిక్‌ సంఘం గుర్తింపు తమకే ఉందని హర్యానా అమేచర్‌ రెజ్లింగ్‌ సంఘం వాదించింది. దీంతో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి అమేచర్‌ రెజ్లింగ్‌ సంఘానికి ఓటు హక్కు కల్పించారు. రిటర్నింగ్‌ ఆఫీసర్‌ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ హర్యానా రెజ్లింగ్‌ సంఘం న్యాయస్థానంలో పిటిషను దాఖలు చేసింది. హర్యానా అమేచర్‌ రెజ్లింగ్‌ సంఘానికి డబ్ల్యూఎఫ్‌ఐ గుర్తింపు ఉంది కానీ, హర్యానా ఒలింపిక్‌ సంఘం నుంచి గుర్తింపు లేదని హైకోర్టులో అడ్వకేట్‌ రవీందర్‌ మాలిక్‌ వాదించారు. తప్పుడు ఆధారాలతో హర్యానా అమేచర్‌ రెజ్లింగ్‌ సంఘం ఎన్నికల్లో ఓటు వేస్తే.. ఎన్నికలు సైతం చెల్లవని రవీందర్‌ తెలిపారు. దీంతో జస్టిస్‌ వినోద్‌ ఎస్‌ భరద్వాజ్‌ నేడు జరగాల్సిన ఎన్నికలపై స్టే విధించారు.
ఇప్పుడెలా? : నేడు జరగాల్సిన ఎన్నికలు వాయిదా పడటంతో భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) యునైటెడ్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌ నుంచి సస్పెన్షన్‌ ఎదుర్కొనే ప్రమాదంలో పడింది. ఎన్నికలు వాయిదా పడితే వేటు వేసేందుకు వెనుకాడమని ఇదివరకే యుడబ్ల్యూడబ్ల్యూ హెచ్చరించింది. మరోవైపు మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన బిజెపి ఎంపీ బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ సింగ్‌ అనుచరులు రెజ్లింగ్‌ సమాఖ్య ఎగ్జిక్యూటివ్‌ కమిటీలో ఎన్నికయ్యేందుకు రంగం సిద్ధం చేసుకోవటంతో ఆందోళనకు దిగిన రెజ్లర్లు కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌తో సమావేశమయ్యారు. బ్రిజ్‌భూషణ్‌, అతడి కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులు, అనుచరులను సైతం ఎన్నికల్లో పోటీ చేయకుండా నిలువరించాలని మహిళా రెజ్లర్లు క్రీడాశాఖ మంత్రిని కోరారు. పంజాబ్‌, హర్యానా హైకోర్టు తీర్పును డబ్ల్యూఎఫ్‌ఐ అడ్‌హాక్‌ కమిటీ సుప్రీంకోర్టులో సవాల్‌ చేసే అవకాశం ఉంది.

Spread the love