ఎన్నికల ప్రవర్తన నియమావళి కచ్చితంగా అమలు చేయాలి

– రాష్ట్ర సరిహద్దుల మీదుగా ప్రవేశించే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు
– పోలీస్‌ కమిషనర్‌ సునీల్‌ దత్‌
నవతెలంగాణ-ఖమ్మం
ఎన్నికల ప్రవర్తన నియమావళి ఖచ్చితంగా అమలు చేయాలని పోలీస్‌ కమిషనర్‌ సునీల్‌ దత్‌ అన్నారు. గురువారం ఆయన పలు చెక్‌పోస్టులను సందర్శించి తనిఖీ చేశారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా జిల్లాలో మోహరించిన కేంద్ర పోలీసు బలగాలతో పాటు స్ధానిక పోలీసులు చెక్‌ పోస్టుల వద్ద తనిఖీలు ముమ్మరం చేసినట్లు తెలిపారు. ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు తావు లేకుండా అంతరాష్ట్ర సరిహద్దులో పటిష్టమైన చెక్‌ పోస్ట్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఖమ్మం పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోకి ప్రవేశించే అన్ని మార్గాల్లో చెక్‌ పోస్టులను ఏర్పాటు చేశామని, జిల్లాల నుంచి వచ్చే ప్రతి వాహనాన్ని, నగరం నుంచి వెళ్తున్న వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారని తెలిపారు. జిల్లాలో 15 ఎఫ్‌ఎస్టి, 15 ఎస్‌ఎస్టి, 2 ఇంటిగ్రేటెడ్‌ ఇంటర్‌ స్టేట్‌ బోర్డర్‌ చెక్‌ పోస్టులు, 10 ఇంటర్‌ స్టేట్‌ చెక్‌ పోస్టులు, 8 ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశామని, 24 ఞ7 గట్టి నిఘా ఉంచామని తెలిపారు. తనిఖీలు చేస్తున్న పోలీసులకు ప్రజలు సహకరించాలని సూచించారు. రాత్రి 10:30 నుండి 11 గంటల లోపు ఖచ్చితంగా వ్యాపార, వాణిజ్య దుకాణాలు, అదేవిధంగా బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం, పబ్లిక్‌ న్యూసెన్స్‌, రాత్రి సమయాల్లో సమయానికి మించిషాపులు తెరవడం, పుట్టినరోజు పేరుతో నడి రోడ్డుపై వాహనాలు అడ్డం పెట్టి న్యూసెన్స్‌ చేస్తూ…ప్రజలకు అసౌకర్యం కలిగించేవారిపై కేసులు నమోదు చేయాలని ఇప్పటికే పోలీస్‌ అధికారులకు ఆదేశించామని తెలిపారు. పోలీస్‌ పెట్రోలింగ్‌ ముమ్మరం చేస్తూ.. రాత్రివేళలో వీధుల్లో సంచరించడం, ఇతర వ్యక్తులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, ఘర్షణలకు దిగడం, ప్రశాంత వాతావరణాన్ని భంగం కలిగించే హిస్టరీ షీట్లపై నిరంతరం నిఘా పెట్టాలని ఆదేశించారు.

Spread the love