‘తాండ్ర’ తండ్లాట..!

'తాండ్ర' తండ్లాట..!– ఒంటరైన ఖమ్మం బీజేపీ అభ్యర్థి వినోద్‌రావు
– ఒక్కనాడైనా ప్రచారానికి రాని జలగం వెంకట్రావు
– అంటీముట్టనట్టుగానే సీనియర్లు గెల్లా, కొండపల్లి..పట్టించుకోని డాక్టర్‌ జీవీ, రంగా కిరణ్‌ తదితరులు
– ఏరికోరి తెచ్చుకున్న కాషాయనేతకు ఏమీ పాలుపోని స్థితి
– గట్టిపోటీనే భావన నుంచి డిపాజిట్‌ దక్కితే చాలనే స్థాయికి..పెయిడ్‌ బృందంతో ప్రచారం..
– ఆదరణ లేక ఆందోళన
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి:
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఖమ్మం లోక్‌సభ అభ్యర్థి తాండ్ర వినోద్‌రావు ప్రచారానికి ఆదరణ కరువైంది. ఉమ్మడి జిల్లాకు చెందిన ముఖ్యనేతలు ఎవరూ ఆయనకు సహకరించకపోవడంతో ఏకాకై ప్రచారం నిర్వహించాల్సి వస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీజేపీకి పెద్దగా చెప్పుకోదగిన నేతలు ఎవరూ లేరు. ఉన్న ముగ్గురు, నలుగురు నాయకులు కూడా అంటీముట్టనట్టుగానే ఉండటంతో తాండ్ర అయోమయంలో పడ్డారనే టాక్‌ వినిపిస్తోంది. కొద్దిరోజుల క్రితం బీజేపీలో చేరిన తాండ్ర సామాజిక తరగతికి చెందిన మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు తనయుడు, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు ఒక్కనాడైనా ప్రచారానికి వచ్చిన దాఖలాలు లేవు. ఆయన అసెంబ్లీ ఎన్నికల అనంతరం బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. సోమవారం కొత్తగూడెంలో నిర్వహించిన ఖమ్మం, మహబూబాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గాల బహిరంగసభకు కూడా ఆయన హాజరుకాలేదు. ఈ సభకు ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా హాజరైనా జలగం రాకపోవడం చర్చనీయాంశంగా మారింది.
అంటీముట్టనట్టే నేతలు..
రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు (ఆర్‌ఎస్‌ఎస్‌) నేతలతో ఉన్న సాన్నిహిత్యంతోనే తాండ్ర వినోద్‌రావు టిక్కెట్‌ దక్కించుకున్నారని ఆ పార్టీలోనే చర్చ నడుస్తోంది. దాంతో స్థానిక బీజేపీ నేతలు ఆయనతో ఎడమొఖం పెడమొఖంగా ఉంటున్నారని సమాచారం. ఆర్థికంగా శ్రీమంతుడైన తాండ్ర బీజేపీకి చేసిందేముంది? అనే ప్రశ్న ఆ పార్టీ జిల్లా నేతల నుంచి వినిపిస్తోంది. పార్టీ, రాజకీయ అవసరాలకు తమను వాడుకొని టిక్కెట్‌ విషయానికి వచ్చే సరికి తమను దూరం పెట్టడంపై కొందరు నేతలు కినుక వహిస్తున్నారు. టిక్కెట్‌ కోసమే ‘కారు’ దిగి బీజేపీలో చేరిన జలగం వెంకట్రావు ఈ విషయంలో సీరియస్‌గానే ఉన్నారని సమాచారం. ఇక ఎప్పటి నుంచో పార్టీని పట్టుకుని ఉంటూ.. ఓడినా పలుమార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ వస్తున్న బీజేపీ రాష్ట్ర నాయకులు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి, ఖమ్మం జిల్లా అధ్యక్షులు గెల్లు సత్యనారాయణ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు కేవీ రంగాకిరణ్‌, విశ్వహిందు పరిషత్‌ (వీహెచ్‌పీ) ఖమ్మం జిల్లా అధ్యక్షులు డాక్టర్‌ గోంగూర వెంకటేశ్వర్లు (జీవీ), సత్తుపల్లి నియోజకవర్గ నాయకులు నంబూరి రామలింగేశ్వరరావు.. ఇలా పలువురు టిక్కెట్‌ ఆశించారు. కానీ వీరెవరికీ దక్కకపోవడంతో ప్రచారం విషయంలో ఈ నేతలంతా అంటీముట్టనట్టే ఉంటున్నారు. జలగం వెంకట్రావు అనుచరుడు, కొత్తగూడేనికి చెందిన న్యాయవాది జీవీకే మనోహర్‌.. జలగంతో పాటు బీఆర్‌ఎస్‌లో చేరినా, బీజేపీలో కొనసాగినా.. ఆయనతో పాటే ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. జాతీయ నాయకులు పొంగులేటి సుధాకర్‌రెడ్డి అడపాదడపా ప్రచారంలో పాల్గొంటున్నా పెద్దగా ఉపయోగం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇలా బీజేపీ అధినాయకత్వం ఏరికోరి టిక్కెట్‌ ఇచ్చిన తాండ్ర వినోద్‌కుమార్‌కు, ఆ పార్టీకి ఏమీ పాలుపోని స్థితి నెలకొంది. కమ్యూనిస్టు, కాంగ్రెస్‌ కోటలో కాషాయ జెండా ఎగురవేస్తామంటూ ప్రగల్భాలకు పోయిన నేతలు రోజురోజుకు నీరుగారి పోతున్నారు. గట్టిపోటీ ఇస్తామనే భావన నుంచి డిపాజిట్‌ దక్కితే చాలనే స్థితికి నెట్టివేయబడుతున్నారనే విశ్లేషణలు వెలువడుతున్నాయి.
పేరుకే స్థానికుడు..
ఇక వినోద్‌రావు స్థానికుడే అయినప్పటికీ ఆయనకు జిల్లాతో ఉన్న అనుబంధంపై విమర్శలు ఉన్నాయి. ఆయన పేరుకే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం ములకలపల్లి మండలం తిమ్మంపేట వాసి అని.. ఆయన మూలాలు ఏపీలోని విజయనగరానికి చెందితే.. ఆయన ఏకలవ్య ఎన్జీవో సంస్థ నిర్వహణ, వ్యాపార కార్యకలాపాలన్నీ కూడా ఆదిలాబాద్‌, ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో కొనసాగుతున్నాయి. కాంగ్రెస్‌ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డిది ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం చేగొమ్మ స్వగ్రామం. అక్కడి నుంచి పక్కనే ఉన్న మహబూబాబాద్‌ జిల్లాకు వెళ్లినా ఆస్తులు, భూములు జిల్లాలోనూ ఉన్నాయి. ఇక బీఆర్‌ఎస్‌ అభ్యర్థి నామ నాగేశ్వరరావు ఖమ్మం జిల్లాకు ఆనుకొని ఉన్న మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలం బలపాలకు చెందిన వారు. కానీ ఆయనకు చిన్ననాటి నుంచి ఖమ్మంతో అనుబంధం ఉంది. 40 ఏండ్ల్లకు పైబడి ఆయన ఖమ్మంలోనే ఉంటూ వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ఈ ఇద్దరు అభ్యర్థులతో పోల్చితే వినోద్‌రావే స్థానికేతరుడనే చర్చ ఖమ్మం పార్లమెంట్‌ పరిధిలో నడుస్తోంది.
ప్రచారాంశాలపైనా విమర్శలు..
వినోద్‌రావు ఎంచుకున్న ప్రచారాంశాల పైన విమర్శలున్నాయి. హిందుత్వ ఎజెండా.. మోడీ భజన చేస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. పార్లమెంట్‌ పరిధిలో ఐటీ పార్కులు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు, సెజ్‌లు.. ఇలా విస్తృత అవకాశాలున్నాయని ఆయన ప్రసంగిస్తుంటే.. పదేండ్ల్లుగా కేంద్రంలో అధికారంలో ఉండి.. ఎందుకు చేయలేదనే ప్రశ్నలు వస్తున్నాయి. తాను ఎంపీగా నెగ్గితే భద్రాద్రి రామాలయాన్ని అభివృద్ధి చేస్తానంటుంటే.. రామాయణ ఇతివృత్తాలున్న భద్రాద్రిని బీజేపీ ఎలా నిర్వీర్యం చేసిందో ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వినోద్‌రావు చేసిన సర్వీసులను పరిశీలిస్తే.. అయోధ్య రామమందిర నిర్మాణానికి తన వంతు సహకారం.. అక్షితల పంపిణీ, అయోధ్యకు కొత్తగూడెం నుంచి రైలు, జిల్లాలో త్రిశూల్‌ దీక్ష నిర్వహణ.. ఇలాంటివన్నీ సెక్యూలరిస్టులు, మైనార్టీలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రచారంలోనూ ఓ మత భక్తిగీతాలు.. మోడీ నామస్మరణ తప్ప.. మరేమీ లేదు. నేతలు, కార్యకర్తలు రాక కొంతమంది పెయిడ్‌ బృందంతో ప్రచారానికి ఆదరణ లేక వినోద్‌రావు వర్గీయులు ఆందోళన చెందుతున్నారు. అంతేకాదు, బీజేపీ ప్రచారం వెలవెలబోతోందని ప్రత్యర్థి పార్టీలు సైతం విమర్శిస్తున్నాయి.

Spread the love