ఆవిర్భావ వేడుకలకు ముస్తాబవుతున్న ట్యాంక్‌ బండ్‌

ఆవిర్భావ వేడుకలకు ముస్తాబవుతున్న ట్యాంక్‌ బండ్‌– రంగు రంగుల విద్యుత్‌ దీపాలతో అలంకరణ
– కళా బందాలచే సాంస్కృతిక కార్యక్రమాలు
– ఏర్పాట్లను పరిశీలించిన ఉన్నతాధికారులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణ అవతరణ వేడుకలకు ట్యాంక్‌ బండ్‌ ముస్తాబువుతోంది. స్వరాష్ట్రం ఏర్పడి పదేండ్లవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అందుకోసం ట్యాంక్‌ బండ్‌ను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. హుస్సేన్‌ సాగర్‌ పరిసరాలను రంగురంగుల విద్యుత్‌ దీపాలతో అలంకరించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్న నేపథ్యంలో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వేడుకలకు సామాన్య ప్రజలు సైతం పెద్ద ఎత్తున హజరయ్యే అవకాశమున్నందున అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేస్తున్నారు. సందర్శకులను ఆకట్టుకునే ప్రదర్శనలు, ఆట వస్తువులు, ఫుడ్‌ స్టాళ్ల ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన కళా బందాలచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర అధికారిక గీతం ‘జయ జయహే తెలంగాణ’ పై పోలీసు సిబ్బందితో ప్రదర్శన నిర్వహించనున్నారు. సభా ప్రాంగణంలో ప్రత్యేక మెడికల్‌ క్యాంపులు, మొబైల్‌ టాయిలెట్లను ఏర్పాటు చేస్తున్నారు. పాటు. సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఎల్‌ఈడీ స్క్రీన్‌లపై లైవ్‌ అందించనున్నారు. ఆవిర్భావ వేడుకల ఏర్పాట్లను బుధవారం పలు విభాగాల ఉన్నతాధికారులు ట్యాంక్‌ బండ్‌ వేదిక వద్ద పరిశీలించారు. జూన్‌ ఒకటి సాయంత్రానికల్లా అన్ని పనులు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్‌, హైదరాబాద్‌ వాటర్‌ వర్క్స్‌ ఎమ్‌డీ. సుదర్శన్‌ రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమీషనర్‌ రోనాల్డ్‌ రోస్‌, పంచాయత్‌ రాజ్‌ శాఖ కమిషనర్‌ అనితా రామచంద్రన్‌, హెచ్‌ఎండీఏ జాయింట్‌ కమిషనర్‌ ఆమ్రపాలి, నగర పోలీస్‌ కమీషనర్‌ శ్రీనివాస్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Spread the love