ఇంకెన్నాళ్లో..?

– అసంపూర్తిగా ఆరోగ్య ఉప కేంద్రం 

– నిర్మాణ దశలోనే గోడలకు పగుళ్లు..
– త్వరితగతిన అందుబాటులోకి తీసురావాలని గ్రామస్తుల విజ్ఞప్తి 
నవతెలంగాణ – బెజ్జంకి 
మండల పరిధిలోని బేగంపేట ఆరోగ్య ఉప కేంద్రం చుట్టూ గ్రామాల ప్రజలకు ఎంతో ఘనంగా వైద్య సేవలందించింది.శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారడంతో తొలగించారు. తొలగించిన కొన్నెండ్లు నూతన భవన నిర్మాణానికి నోచుకోలేదు.భవనాన్ని తొలగించి నాటి నుండి నేటి వరకు గ్రామ పంచాయతీ అవరణంలో తాత్కాలికంగా కేటాయించిన భవనంలో గర్భిణులకు,రోగులకు ఆరోగ్య కేంద్రం సిబ్బంది వైద్య సేవలందిస్తున్నారు. గతంలో ఎంతో ఘనంగా సేవలందించిన ఉప కేంద్రం వైద్య సేవలను మళ్లీ కళ్లారా చూడడం కలగానే మిగులుతోందనే ప్రజలు నిరాశకు ఎట్టకేలకు ముందడుగు పడింది. జాతీయ ఆరోగ్య మిషన్ ద్వార మంజూరైన రూ.16 లక్షల నిధులతో నూతన ఆరోగ్య ఉప కేంద్రం భవన నిర్మాణానికి జూలై 5,2021న అప్పటి మానకోండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ప్రజాప్రతినిధులు,సంబధిత అధికారులతో కలిసి శంకుస్థాపన చేశారు. దీంతో ఆరోగ్య కేంద్రం సిబ్బందితో పాటు గ్రామస్తుల్లో ఆశలు చిగురించాయి. నిర్మాణ పనులు ప్రారంభమై కొన్ని నెలలు పునాదుల దశలోనే నిలిచిపోయాయి.ప్రస్తుతం భవన నిర్మాణ పనులు అసంపూర్తితో దర్శనమిస్తున్నాయి. వర్షాకాలం దృష్ట్యా ప్రజలు సీజనల్ వ్యాధులు బారిన పడే ప్రభావం ఉండడంతో అసంపూర్తిగా నిలిచిపోయిన పనులను త్వరితగతిన పూర్తి చేసి ఆరోగ్య ఉప కేంద్ర భవనాన్ని అందుబాటులోకి తీసుకవచ్చేల సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
నిర్మాణ దశలోనే పగుళ్లు..!
నూతన ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణ పనుల దశలోనే గోడలు పగుళ్ల బారిన పడుతున్నాయి.నిర్మాణ దశలో అధికారులు పర్యవేక్షణలో అలసత్వం వహించడం వల్లే నాణ్యత లోపాలు తలెత్తి పగుళ్లు ఏర్పడుతున్నాయని గ్రామస్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఆరోగ్య ఉప కేంద్ర భవనాన్ని క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించి నాణ్యత ప్రమాణాలతో భవన నిర్మాణాన్ని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకవచ్చేల దృష్టి సారించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఎమ్మెల్యే కవ్వంపల్లి దృష్టి సారించాలి..
అసంపూర్తి నిర్మాణ పనులతో నిలిచిపోయిన ఆరోగ్య ఉప కేంద్ర భవనం అందుబాటులోకి తీసుకవచ్చేల మానకొండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రత్యేక శ్రద్ధ వహించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి వృత్తిరీత్యా వైద్యలవ్వడంతో ప్రజారోగ్యంపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.
నిధులు లేకపౌవడంతోనే: వినోద్ బాబ్జీ, వైద్యాధికారి..బెజ్జంకి
ప్రభుత్వం మంజూరీ చేసిన నిధుల మేరకు సంబంధిత గుత్తేదారు నిర్మాణ పనులు చేపట్టాడు. నిధులు లేకపోవడంతోనే ఆరోగ్య ఉప కేంద్ర నిర్మాణ పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. భవన నిర్మాణ పనులపై సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్తాను.
Spread the love