ఆయనకు క్షమాభిక్ష ప్రసాదించండి : ఇజ్రాయిల్‌కు ట్రంప్ సూచన
వాషింగ్టన్ : ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ‘యుద్ధవీరుడు’గా కొనియాడారు. ఆయనపై నమోదైన అవినీతి కేసుల విచారణను రద్దు చేయాలని ఇజ్రాయిల్‌ను కోరారు. తప్పు చేయకపోయినా నెతన్యాహూను ఈ కేసు మంత్రగత్తెలా వెంటాడుతోందని ఆరోపించారు. ముడుపులు, మోసం, నమ్మకద్రోహం ఆరోపణలపై నెతన్యాహూపై 2019లో ఇజ్రాయిల్‌లో కేసు నమోదైంది. ఈ కేసు విచారణను తక్షణమే రద్దు చేయాలని, నెతన్యాహూకు క్షమాభిక్ష ప్రసాదించాలని ట్రంప్ సూచించారు. ఇజ్రాయిల్ కోసం ఎంతో చేసిన గొప్ప హీరో అంటూ నెతన్యాహూను ఆయన ప్రశంసలతో ముంచెత్తారు. నెతన్యాహూ సోమవారం న్యాయస్థానంలో హాజరు కావాల్సి ఉన్నదని తనకు తెలిసిందని ట్రంప్ తన ట్రూత్ సామాజిక వేదికలో పేర్కొన్నారు.
‘దేశానికి ఎంతో సేవ చేసిన నెతన్యాహూను మంత్రగత్తెలా వేటాడడం నాకు నమ్మశక్యంగా లేదు’ అని ట్రంప్ తెలిపారు. మూడు క్రిమినల్ కేసులకు సంబంధించి నెతన్యాహూపై 2020లో విచారణ ప్రారంభమైంది. తనపై వచ్చిన ఆరోపణలను నెతన్యాహూ తోసిపుచ్చుతూ తానేమీ తప్పు చేయలేదని వాదించారు. టెల్ అవీవ్ కోర్టులో నెతన్యాహూ క్రాస్-ఎగ్జామినేషన్ ఈ నెల 3న ప్రారంభమైందని, విచారణ పూర్తి కావడానికి సంవత్సర కాలం పట్టవచ్చునని ఇజ్రాయిల్ మీడియా తెలియజేసింది.
నెతన్యాహూకు క్షమాభిక్ష ప్రసాదించే అధికారం ఇజ్రాయిల్ ప్రధాని ఐసాక్ హర్‌జాగ్‌కు ఉంది. అయితే ఆ ప్రతిపాదన ఏదీ ప్రస్తుతం పరిశీలనలో లేదని మీడియా వార్తలు చెబుతున్నాయి. అలాంటి అభ్యర్థనలేవీ తనకు అందలేదని హర్‌జాగ్ కూడా స్పష్టం చేశారు. ‘ఇజ్రాయిల్‌ను రక్షించింది అమెరికాయే. ఇప్పుడు బిబి నెతన్యాహూను రక్షించబోయేది కూడా అమెరికాయే’ అని ట్రంప్ తన పోస్టులో చెప్పుకొచ్చారు. ఇజ్రాయిల్ నేతను ట్రంప్ ‘బిబి నెతన్యాహూ’ అని పిలుస్తుంటారు. కాగా నెతన్యాహూపై వచ్చిన ఆరోపణల కేసులను ట్రంప్ లేదా అమెరికా ప్రభుత్వం ఎలా అడ్డుకుంటుందో తెలియడం లేదు.
తాజాగా నెతన్యాహూను వెనకేసుకొచ్చిన ట్రంప్ బుధవారమే ఆయనపై విరుచుకుపడిన విషయం గుర్తుండే ఉంటుంది. కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించిన తర్వాత ఇరాన్‌పై ఇజ్రాయిల్ బాంబుల వర్షం కురిపించిందని, అలాంటివి తాను గతంలో ఎన్నడూ చూడలేదని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇంత భారీగా బాంబు దాడులు చేయడాన్ని గతంలో నేను చూడలేదు. ఇజ్రాయిల్ చర్యలతో నేను సంతోషంగా లేను’ అని అన్నారు. ట్రంప్ వ్యాఖ్యలను నెతన్యాహూ సన్నిహితులు కొందరు స్వాగతించడం గమనార్హం. ఇదిలావుండగా నెతన్యాహూపై విచారణను రద్దు చేయాలంటూ ట్రంప్ చేసిన సూచనను ఇజ్రాయిల్ జాతీయ భద్రతా మంత్రి ఇతమర్ బెన్-గ్విర్ సమర్ధించారు.
నెతన్యాహూపై అవినీతి కేసులు రద్దు చేయండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES