– సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
అమరావతి : అదానీ గ్రూపు కంపెనీల్లో సెబీ ఛైర్మన్‌కు వాటాలు ఉన్నాయనే ఆరోపణలపై సీపీఐ దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనున్నట్లు సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ తెలిపారు. బుధవారం విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హిండెన్‌బర్గ్ రిపోర్టు సంచలన అంశాలను బయటపెడుతోందని తెలిపారు. అదానీని మోడీ రక్షిస్తున్నారని, ఆరోపణలు ఎదుర్కొంటున్న సెబీ ఛైర్మన్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎంతో శక్తిమంతమైన సెబీని మోడీ నిర్వీర్యం చేస్తున్నారని, ఎన్నికల కమిషన్‌ను, ఆర్‌బిఐని అలాగే చేశారని, న్యాయ వ్యవస్థను కూడా మోడీ గుప్పెట్లో పెట్టుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి డమ్మీ అయ్యారని, ఈ నేపథ్యంలో అదానీ, సెబీ వ్యవహారంపై దేశవ్యాప్త ఆందోళన చేపడతామని హెచ్చరించారు. బంగ్లాదేశ్ ఘటనపై భారతదేశం వ్యవహరిస్తున్న తీరు సరికాదని అన్నారు. ముజీబుర్ రహ్మన్ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని ఖండించారు.
ప్రస్తుత అధ్యక్షులు యూనస్ మైక్రోఫైనాన్స్‌కు ఆద్యుడని తెలిపారు. అక్కడ జరుగుతున్న ఘటనపై గోరంతలు కొండంతలు చేసి దేశంలో లౌకికవాదాన్ని దెబ్బతీసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని తెలిపారు. వయనాడ్ విలయాన్ని జాతీయ విపత్తుగా గుర్తించాలని కోరారు. ఢిల్లీలో ఆప్ మంత్రి అతిశీ పతాకావిష్కరణ చేస్తారని సిఎం చెబితే ఎల్‌జి తిరస్కరిస్తున్నారని, ఇదేమి ప్రజాస్వామ్యమని ప్రశ్నించారు. అంబేద్కర్ పేరుతో సమానంగా జగన్ పేరు ఉండటం సమంజసం కాదని తెలిపారు. ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ కోరారు.