మెనూ ప్రకారం ఆహారాన్ని అందించాలి

మెనూ ప్రకారం ఆహారాన్ని అందించాలి– కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే
నవతెలంగాణ-ఆసిఫాబాద్‌
విద్యార్థులకు మెనూ ప్రకారం పోషక విలువలు కలిగిన నాణ్యమైన ఆహారాన్ని సకాలంలో అందించాలని కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఆశ్రమోన్నత బాలుర పాఠశాలను ఆకస్మికంగా సందర్శించి తరగతి గదులు, వంటశాల, భోజనశాల, మూత్రశాలలు, వాటర్‌ ట్యాంక్‌, పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారాన్ని అందించాలని తెలిపారు. విద్యార్థులకు అందించే ఆహారంలో నాణ్యమైన నిత్యవసర వస్తువులు, తాజా కూరగాయలు వినియోగించాలని, ప్రభుత్వం అందించిన మెనూ తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు విధుల పట్ల సమయపాలన పాటించాలని, విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేసి వార్షిక పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించే విధంగా కృషి చేయాలని తెలిపారు. హరితహారంలో భాగంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. నూతనంగా మంజూరైన పాఠశాల భవనాల నిర్మాణానికి సంబంధించి స్థలాన్ని గుర్తించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి రమాదేవి, పాఠశాల ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్‌, వార్డెన్‌ కిషన్‌, పీడీ మధుసూదన్‌, ఉపాధ్యాయులు జాదవ్‌ కిరణ్‌ కుమార్‌, ప్రేమలత, అనిత, లక్ష్మీనారాయణ, గోపాల్‌, జాగేశ్వర్‌ పాల్గొన్నారు.

Spread the love