కుల ఉన్మాదం ముందు ప్రేమ ఓడిపోతోంది. కన్న బిడ్డల రక్తాన్నే కండ్ల చూస్తోంది. పరువు పేరుతో నిండు ప్రాణాలను బలితీసుకొంటోంది. తక్కువ కులం వ్యక్తిని ప్రేమించారని, పెండ్లి చేసుకున్నారని కనీ పెంచిన మమకారాన్ని మరిచి కత్తులతో దాడి చేసే దుస్థికి దిగజారుతున్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న తమ పిల్లల జీవితాలను కడతేరుస్తున్నారు. రోజురోజుకి ఘనీభవిస్తున్న కుల వ్యవస్థ వల్లే ఇటువంటి ఘటనలు నిత్యకృత్యమవుతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇటీవలే సూర్యాపేట జిల్లా, తుంగతుర్తిలో వడ్లకొండ కృష్ణ అనే దళిత యువకుడిపై కులదురహంకారం చేసిన అమానుష హత్య మరువక ముందే, ఆంధ్రప్రదేశ్లో దళిత యువకుడిని ప్రేమించినందుకు ఓ ఆడబిడ్డ తన తండ్రి చేతిలోనే హతమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రకాశం జిల్లా, తాళ్లూరు మండలం, కొత్తపాలం గ్రామానికి చెందిన కోట వైష్ణవిని అర్థరాత్రి గొంతు నులిపి చంపేసిన తండ్రి, అనారోగ్య సమస్యలతో చనిపోయిందని అందరినీ నమ్మించేందుకు ప్రయత్నించాడు. చివరకు నిజం బయటపెట్టాడు.
ఒకప్పుడు కేవలం ఉత్తర భారతదేశానికి మాత్రమే పరిమితమైన ఈ దారుణాలు మనువాదుల పాలనలో దేశమంతా వ్యాపిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ కులదురహంకార హత్యలు నానాటికీ పెరిగిపోతున్నాయి. మహిళలను సొంత ఆస్తిగా, ఇంటి పరువుగా భావించే ఈ మనువాద, పితృస్వామ్య వ్యవస్థలో మహిళలు తమ జీవిత భాగస్వామిని ఎన్నుకునే స్వేచ్ఛ లేకుండా పోయింది. ఇతర కులాలకు, మతాలకు చెందిన యువకులను ప్రేమించడం, పెండ్లి చేసుకోవడం నేడు ప్రాణాంతకంగా మారింది. ప్రేమించిన వ్యక్తితో జీవితాంతం కలిసి బత కాలనుకుంటున్న వారిపై కన్న తల్లిదండ్రులే కక్ష కట్టేలా నేటి సమాజం చేస్తోంది. అయితే ఈ సమస్య ఏ ఒక్క కులం వారిదో కాదు. అన్ని కులాలల్లోనూ, మతాల్లోనూ ఈ దురహంకార హత్యలు జరగడం ఆందోళనాకరం.
కులం, వర్గం, మతం అని చూడకుండా ఒక అమ్మాయి తనకు నచ్చిన యువకున్ని ఎంచుకుని, ప్రేమించి పెండ్లి చేసుకోవడానికి కుటుంబ సభ్యులు, కుల సమూహం అంగీకరించడం లేదు. వ్యక్తి గుణం కంటే కులానికి, మతానికే ప్రాధాన్యమిస్తూ ఇతర కులాలు, మతాల వారితో పెండ్లికి నిరాకరిస్తున్నారు. వాస్తవానికి కులాంతర, మతాంతర ప్రేమ వివాహాలు చేసుకోవడానికి ముందుకొస్తున్న యువతను అభినందించి, అండగా నిలబడాల్సిన పౌర సమాజమే వారిపై కక్ష గట్టినట్టుగా తరుముతున్నది ఆదరించే అండ కరువైన ఇలాంటి జంటలు ఒంటరిగా మిగిలిపోతున్నాయి. ఆ కుటుంబాలను సైతం సమాజం అవమానిస్తూ వేధింపులకు గురిచేస్తోంది. ‘మన కులం పరువు పోతోంది, వాళ్లను పట్టుకుని చంపండి’ అంటూ కులోన్మాదాన్ని రెచ్చగొడుతున్నాయి. ఇలాంటి అవమానాలను ధైర్యంగా ఎదుర్కోలేని కుటుంబాలు కడకు కత్తులు పట్టి హత్యలను ప్రేరేపిస్తున్నాయి, హతమరుస్తున్నాయి. సూర్యాపేట కృష్ణ, ప్రకాశం జిల్లా వైష్ణవి విషయంలో అక్షరాల జరిగిందిదే.
ఒక పరంపరగా సాగుతున్న ఇలాంటి హత్యా సంస్కృతి ఆందోళన కలిగిస్తోంది. కులదురహంకారంతో ఇలాంటి హత్యలు చేస్తున్న వారిని సమర్ధించే వైఖరి సైతం సమాజంలో పెరిగిపోవడం పరిస్థితులను మరింత దారుణంగా తయారుచేస్తోంది. హత్యలను సమర్ధించడం కోసం ప్రేమికులను నేరస్తులుగా చిత్రీకరిస్తూ వారి వ్యక్తిత్వ హననానికి సైతం పాల్పడుతున్నారంటే మనిషి ఆలోచనలు ఎటుపోతున్నాయనే ఆలోచన రాకమానదు. తక్కువ కులానికి చెందిన యువకులను క్రూరంగా హింసించి దారుణంగా హత్య చేస్తున్నారు. అదే యువతి అగ్రకులానికి చెందిన యువకున్ని ప్రేమిస్తే ఆమె వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ తీవ్రంగా అవమానిస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన ఘటనలను పరిశీలిస్తే ఇది స్పష్టంగా కనిపిస్తున్నది.
ఇటువంటి దారుణ హత్యాకాండలకు వ్యతిరేకంగా ముందుండి పోరాడాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉన్నది. ఇవి పునరావృతం కాకుండా చూడాలి. కుల దురంహంకార హత్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పాలకులను నిలదీయాలి. కులతత్వాన్ని, మతతత్వాన్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్న ఉన్మాద గుంపులను ప్రతి ఘటించాలి. మనుషులంతా ఒకటేననే భావనకు దోహదపడే కులాంతర, మతాంతర ప్రేమ వివాహలను ప్రోత్సహించాలి. అలాగే కులాంతర వివాహితుల రక్షణ కోసం ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక చట్టం చేయాలి. ఇలాంటి కేసుల విచారణ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి నిందితులకు వెంటనే శిక్షపడేలా చేసినప్పుడే కొంతైనా మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా తల్లిదండ్రుల ఆలోచనా ధోరణిలో మార్పు రావాలి. పిల్లల ప్రేమను గౌరవించాలి. కులమతాలకు అతీతంగా మనిషి వర్ధిల్లే రోజు రావాలి. ఇందుకు అవసరమైన మార్పు సమాజంలో రావాలి. దీనికి ప్రజలు, ప్రభుత్వాలు బాధ్యతగా కృషి చేయాలి.