ప్రాణాలతో ‘యాపా’రం!

Sampadakiyamమహాభారత యుద్ధం ఎందుకు జరిగిందని మనకు మనమే ప్రశ్న వేసుకుని ఆలోచిస్తే, జూదంలో కోల్పోయిన రాజ్యాన్ని , ఆఖరికి భార్యను కూడా కోల్పోవడం, తిరిగి రాజ్యాన్ని పొందేందుకు కురుక్షేత్ర యుద్ధమే తప్పలేదు. అది భారత కథ. రాజుల నాటి కథ. రాజులు జూదం ఆడటం రివాజు ఆనాటికి. ఎప్పుడయినా జూదం ఆశతో, అత్యాశతో కూడుకుని దురాశగా పరిణామం చెందుతుంది. ఆఖరికి అందరినీ ముంచుతుంది. జూదమూ ఓ రకమైన పందెమే! బానిస సమాజంలోనైతే పందెం కాసి, ఇద్దరు బానిసలను బల ప్రయోగానికి, చంపుకోవడానికి పురికొల్పేవారు. పందాల్లో చంపడం, చావడం ఖాయంగా ఉండింది. ఇప్పటి కోడి పందేలలాంటిదన్నమాట. ఇదొక భూస్వామిక విధానపు క్రూరవినోదం. ప్రజలు దీనికి సమిధలు, ప్రజాధనం దీనికి సమర్పణం. ఇప్పుడిక ఆధునిక వ్యాపార సమాజంలో లాభాల ఆశల ఎరకు చిక్కి బలైపోతున్న సామాన్య ప్రజల దీనగాథలు కోకొల్లలు.ఈ దోపిడీ వ్యవస్థలో కునారిల్లిపోతున్న, దారిద్య్రం ముంచెత్తుతున్న సామాన్య ప్రజల ఆశలను, ఆవేశాలను వినియోగించుకుని మరింత దోపిడీకి పాల్పడుతున్న పాచికే ఈ పందెం, బెట్టింగ్‌, మల్టీ లెవల్‌ మార్కెటింగ్‌ మొదలైన సాధనాలు. ప్రపంచీకరణ, రియలెస్టేటు బూమ్‌లు సమాజంలో ‘ఈజీమని’ని పరిచయం చేశాయి. ఆ భ్రమలో పడి అనేకమంది తమ జీవితాలను, సంసారాలను, కుటుంబాలను ధ్వంసం చేసుకుంటున్నారు.
ఇప్పుడీ డిజిటల్‌ యుగంలో బెట్టింగ్‌యాప్‌ల రూపంలో సైబర్‌ దోపిడీకి తెరలేపారు నయాజూదగాళ్లు. వేల కోట్ల రూపాయల్ని సామాన్యుల నుండి కొల్లగొట్టే సంస్థలు వేలకొలది పుట్టుకొచ్చాయి. మన రాష్ట్రంలోనే వందలమంది ప్రాణాలను ఈ బెట్టింగ్‌ యాప్‌లు బలితీసుకున్నాయి. భర్తలకు తెలియకుండా భార్యలు, భార్యలకు తెలియకుండా భర్తలు ఈ ఆటలకు బానిసలై కుటుంబాలనే హతమార్చుకున్నారు. డబ్బులు ఎక్కువొస్తాయని ఆశ పడుతున్న వాళ్లకు అత్యాశను కల్పిస్తూ, వారి కండ్లముందే గొప్ప కథనాలను వినిపించి, మెస్మరిజానికి గురిచేస్తూ లక్షాధికారులు కోటీశ్వరులు అయిపోయినట్లుగా భ్రమాత్మక ఊహాలోకి తీసుకు వెళతారు. మొదట చిన్నచిన్నగా లాభాల ఎర చూపిస్తారు. ఆ తర్వాత పెద్ద బెట్టింగులకు పూనుకోగానే ముంచి ఊరుకుం టారు. యాప్‌లే కాదు, సోషల్‌ మీడియాలో స్పాన్సర్స్‌ ప్రకటనలు విపరీతంగా ప్రసారం అవుతున్నాయి. రాష్ట్రపతి ముర్ము, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి, సుధ, ముఖేష్‌ అంబానీలాంటి ప్రముఖులు చెబుతున్నట్టుగానే వీడియోలు ఫేక్‌వి వచ్చాయి. రూ.21వేలు ఇన్వెస్ట్‌చేస్తే నెల, రెండునెలల్లోనే పదిహేను లక్షలు సంపాదిం చవచ్చని దాని సారం. ‘డబ్బులెవరికీ ఊరకనే రావు’ అన ప్రకటన తప్పక గుర్తుకు రావాల్సిన అవసరం ఉంది. వీటిని అరికట్టడం ఎలాగో ప్రభుత్వం ఆలోచించాలి.
ఈ బెట్టింగ్‌ యాప్‌లు ప్రమోషన్లలో దేశంలోని ప్రముఖులతో పాటు సినీతారలు, ఆటగాళ్లూ పాల్గొంటున్నారు. భారతరత్న సచిన్‌ టెండూల్కర్‌, షారుఖ్‌ఖాన్‌, కోహ్లీలపైనా యాప్‌లు ప్రమోషన్‌ చేశారని ఫిర్యాదు చేశారు. మన తెలుగు సినీ తారలు బాలకృష్ణ, ప్రభాస్‌, గోపిచంద్‌, రానా, ప్రకాశ్‌రాజ్‌, విజరు దేవరకొండ, మంచు లక్ష్మి, శ్యామల, విష్ణుప్రియ ఇలా ఎన్నో పేర్లు బయటకి వచ్చాయి. ఫన్‌-88 యాప్‌ ద్వారా కోట్లాది రూపాయలు తరలించుకుపోయారని ఆరోపణలొచ్చాయి.ఈ మధ్య హైదరాబాద్‌ పోలీసులు సైబర్‌క్రైం విభాగం ఈ బెట్టింగ్‌ యాప్‌లపై తీవ్రంగా దాడులు చేసి కేసులు నమోదు చేశారు. ఇప్పటిదాకా 385 కేసులు పెట్టారు. ప్రమోటర్లను ప్రశ్నిస్తున్నారు. ఇంతెందుకు మన మెట్రోరైల్లోనే ఈ బెట్టింగ్‌ యాడ్స్‌ పెద్ద ఎత్తున దర్శనమిస్తున్నాయి. తొలగిస్తామని అధికారులు చెబుతున్నారు. 2017లో ప్రమోట్‌ యాడ్‌లో పాల్గొన్నానని, తర్వాత అది మోసమని తెలిసి రద్దు చేసుకున్నానని ప్రకాశ్‌రాజ్‌ ప్రకటించాడు. మిగతా ఎవరూ ఇంకా స్పందించలేదు. కొందరు మాత్రం తెలియక చేశామంటున్నారు. ప్రభుత్వం కూడా అసెంబ్లీలో ప్రకటన చేసింది. ఈ బెట్టింగ్‌ యాప్‌లపై కఠినంగా వ్యవహరిస్తామని, ప్రచారం కల్పించేవారినీ విచారిస్తామని తెలిపింది. ఇటీవలే మొదలైన ఐపిఎల్‌ క్రికెట్‌పైన కూడా బెట్టింగ్‌లు కొనసాగుతున్నాయి. లక్షల రూపాయలు కోల్పోయిన ఓ యువకుడు మొన్న ఆత్మహత్య చేసుకున్నాడు. తక్కువ సమయంలోనే భారీ లాభాలిస్తామని డెయిరీఫామ్‌ నిర్వహిస్తున్నామని రూ.20కోట్లతో బిచాణా ఎత్తేసింది ఓ ఫేక్‌ సంస్థ. మల్టీ లెవల్‌ మార్కె టింగ్‌లో భాగంగా మొదట కొందరి పెట్టుబడులకు లాభాలందిస్తూ క్రమంగా అందరినీ మోసానికి గురిచేస్తున్నారు. ఈ ఆర్థిక సైబర్‌ నేరగాండ్ల ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. డబ్బులపై ప్రజలకున్న ఆశను, ఆసరా చేసుకుని ఇలాంటి మోసాలకు పాల్పడటం ఈ మధ్యకాలంలో పెరిగింది. వీటికి తారలూ, ప్రముఖులు ప్రచారం చేయడం వల్ల ప్రజలింకా నమ్మకం పెంచుకుంటున్నారు. వీటి ఉచ్చులో పడకుండా ప్రజలు, ముఖ్యంగా యువత అప్రమత్తంగా ఉండాలి.

Spread the love