కొత్తగా 204 అంబులెన్సులు, 228 అమ్మ ఒడి వాహనాలు

– అదనంగా 34 పార్థివ వాహనాలు అందుబాటులోకి
– మొత్తం 466 వాహనాలు ఆగస్టు 1న ప్రారంభం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో 108 అంబులెన్సులు, 102 (అమ్మ ఒడి), హర్సె (పార్థివ వాహనాల) సేవల కోసం కొత్తగా 466 వాహనాలు అందుబాటులోకి రానున్నాయి. సీఎం కేసీఆర్‌ ఆదేశం మేరకు వైద్యారోగ్య శాఖ నూతనంగా 204 అంబులెన్సులు, 228 అమ్మ ఒడి వాహనాలు, 34 హర్సె వాహనాలను కొనుగోలు చేసింది. వీటిని ఆగస్టు 1వ తేదీన ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ప్రజలకు వైద్య సేవలందిస్తున్న 108, 102, పార్థివ వాహనాల పనితీరుపై మంత్రి హరీశ్‌ రావు గత నెలలో సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే.
వాహనాల పనితీరు, రిపేర్లు, మెయింటెనెన్స్‌ వంటివి ఎప్పటికప్పుడు పర్యవేక్షించి నివేదికలు రూపొందించుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. కాలం చెల్లిన అంబులెన్సులు, అమ్మ ఒడి, హర్సె వాహనాలను వెంటనే తొలగించి, వాటి స్థానంలో నూతన వాహనాలను చేర్చాలని ఆదేశించారు. తద్వారా గర్భిణులు, రోగులను వేగంగా దవాఖానలకు చేర్చేందుకు వీలు కలుగుతుందని చెప్పారు. ఈ మేరకు అధికారులు కొత్త వాహనాలను కొనుగోలు చేసి, బ్రాండింగ్‌ పూర్తి చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 426 అంబులెన్సులు అందుబాటులో ఉన్నాయి. 175 అంబులెన్సుల స్థానంలో కొత్తవి రిప్లేస్‌ చేస్తుండగా, మరో 29 అంబులెన్సులను అవసరమున్నట్టు గుర్తించిన కొత్త ప్రాంతాల్లో వినియోగించనున్నారు. ఈ 204 కొత్తవి కలిపితే రాష్ట్రంలో 108 అంబులెన్సుల సంఖ్య 455కు పెరగనున్నది. గర్భిణుల కోసం ప్రవేశపెట్టిన అమ్మ ఒడి వాహనాలు (102 వాహనాలు) ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 300 ఉపయోగంలో ఉన్నాయి. ఇందులో 228 వాహనాలకు కాలం చెల్లిపోవడంతో వాటిని తొలిగించి, వాటి స్థానంలో కొత్తగా 228 వాహనాలను రిప్లేస్‌ చేస్తున్నారు.
ప్రధాన ప్రభుత్వ దవాఖానల్లో మరణించినవారి పార్థివ దేహాలను స్వస్థలాలకు తరలించడం కోసం ప్రభుత్వం ఉచితంగా హర్సె వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. ఈ హర్సె వాహనాలు ప్రస్తుతం 50 ఉన్నాయి. ఇందులో 34 వాహనాలకు కాలం చెల్లిపోయింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొత్తగా 34 వాహనాలను వీటి స్థానంలో రిప్లేస్‌ చేస్తున్నది.
మంత్రి హరీశ్‌రావు ఆదేశాల మేరకు కొత్తగా సమకూర్చుకున్న మూడు రకాల వాహనాలకు సరికొత్తగా బ్రాండింగ్‌ చేశారు. 108, 102 అనే హెల్ప్‌లైన్‌ సేవల నంబర్లు స్పష్టంగా కనిపించేలా ఏర్పాటు చేశారు. సీఎం కేసీఆర్‌ ఫోటో, తెలంగాణ ప్రభుత్వ లోగో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అమ్మఒడి వాహనాలు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. వాహనం వెనుక భాగంలో అమ్మకు ఆత్మీయతతో.. బిడ్డకు ప్రేమతో.. అనే ట్యాగ్‌లైన్‌తో పాటు, సీఎం కేసీఆర్‌ ఓ బాలింతకు కేసీఆర్‌ కిట్‌ను అందిస్తున్న ఫొటోను ముద్రించారు. చూడటానికి ఆహ్లాదంగా ఉండే రంగుల్లో, అమ్మ ఒడి కార్యక్రమ లోగో, శిశువు ఫొటోలతో 102 వాహనాలు కొత్త లుక్‌తో అందుబాటులోకి రానున్నాయి. పార్థివ వాహనాల సేవలు ఉచితంగా అందిస్తామనే విషయాన్ని తెలిపే విధంగా ఉచిత సేవ అని ముద్రించారు.

Spread the love