– మైనార్టీ గురుకుల కార్యదర్శి స్పష్టీకరణ: టీఎస్‌యూటీఎఫ్ నేతల వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని మైనార్టీ గురుకుల విద్యాసంస్థల్లో పనిచేస్తున్న అధ్యాపకులకు వేతనాలను నిలుపుదల చేయడం లేదని మైనార్టీ గురుకులాల కార్యదర్శి షఫీయుల్లా స్పష్టం చేశారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో తక్కువ ప్రవేశాలు నమోదు చేసిన మైనార్టీ గురుకుల కాలేజీల అధ్యాపకులకు గతనెల వేతనాలను నిలిపేయాలంటూ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలియగానే తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి, పత్రిక సంపాదకులు పి మాణిక్‌రెడ్డి స్పందించి మంగళవారం ఆ సొసైటీ కార్యదర్శి షఫీయుల్లాను కలిసి వినతిపత్రం సమర్పించారు. వేతనాలు నిలిపేయాలన్న ఆదేశాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారు. ‘ఎవరి జీతం నిలుపుదల చేయడం లేదు. కేవలం అడ్మిషన్లు, హాజరును పెంచుకోవడానికే హెచ్చరించాం’అని షఫీయుల్లా చెప్పారు. ప్రిన్సిపాళ్లకు మార్చి నుంచి రావాల్సిన వార్షిక ఇంక్రిమెంట్లు మంజూరు చేయడానికి రీజినల్ కోఆర్డినేటర్ ఖాళీల్లో సీనియర్ ప్రిన్సిపాళ్లను నియమించడానికి ఆయన అంగీకరించారు.
టీజీపీఏ ఖండన
మైనార్టీ గురుకులాల్లో అడ్మిషన్ల పేరుతో ఆంక్షలు, టార్గెట్‌ను నిర్ణయించడాన్ని తెలంగాణ గురుకుల ప్రిన్సిపాళ్ల సంఘం (టీజీపీఏ) తీవ్రంగా ఖండించింది. వాస్తవాలకు దగ్గరగా గురుకులాల్లో గుణాత్మక మార్పు దిశగా అధికారులు ఆదేశాను జారీ చేయాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అజరు డిమాండ్ చేశారు. ఆర్థికంగా ఇబ్బంది పెట్టే విధంగా, అధ్యాపకుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉండొద్దని కోరారు.