‘గృహలక్ష్మి’ నిరంతర ప్రక్రియ : మంత్రి ప్రశాంత్‌రెడ్డి

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
‘గృహలక్ష్మి’ పథకం నిరంతర ప్రక్రియ దరఖాస్తుల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. బుధవారంతో తొలి విడత గడువు ముగియనున్న నేపథ్యంలో మంత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. సొంత స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణం కోసం రూ.3లక్షలు ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారని గుర్తు చేశారు. ఈ పథకాన్ని నిరంతరాయంగా అమలు చేస్తామన్నారు. గ్రామకంఠంలో ఉన్న పాత ఇండ్లు, స్థలాలకు దస్తావేజు పేపర్లు ఉండవనీ, ఇంటి నంబర్‌ లేకుంటే ఖాళీ స్థలం ఉన్నా దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి వివరించారు. దరఖాస్తు గడువు అయిపోయిందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. దరఖాస్తుదారులు తమ ప్రజాప్రతినిధులతో జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తులు పంపించవచ్చని చెప్పారు. ప్రతి నియోజకవర్గానికి ప్రస్తుతం మొదటి దశలో 3000 ఇండ్లు పూర్తయిన తర్వాత రెండో దశలో ఇచ్చే ‘గృహలక్ష్మి’ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. దశల వారీగా అర్హులైన పేదల ఇంటి నిర్మాణం కోసం ఈ పథకాన్ని అమలు చేయనున్నట్టు మంత్రి పేర్కొన్నారు.

Spread the love