– బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించిన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల గడువును ఈనెల 31 వరకు ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆలస్య రుసుం లేకుండా రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రభుత్వరంగ జూనియర్ కాలేజీల్లో చేరేందుకు అవకాశముందని తెలిపారు. ప్రయివేటు కాలేజీల్లో చేరాలంటే రూ.750 ఆలస్య రుసుం చెల్లించాల్సిందేనని స్పష్టం చేశారు. కాలేజీల ప్రిన్సిపాళ్లు విద్యార్థులను ఈనెల 31 వరకు చేర్చుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో గుర్తింపు పొందిన జూనియర్ కాలేజీల్లోనే ప్రవేశాలు పొందాలని విద్యార్థులు, తల్లిదండ్రులను కోరారు. ఇంటర్ బోర్డు వెబ్‌సైట్‌లో ఆ కాలేజీల జాబితాను పొందుపర్చామని వివరించారు.