వేతనాల పెంపు, ఇతర డిమాండ్ల పరిష్కారంపై మంత్రి హామీ

– ఐకేపీ వీఓఏ ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షులు ఎస్వీ.రమ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఐకేపీ వీఓఏల వేతనాల పెంపు, ఇతర డిమాండ్లు పరిష్కరించేలా చూస్తానని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హామీనిచ్చారని తెలంగాణ ఐకేపీ వీఓఏ ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షులు ఎస్వీ.రమ తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లో మంత్రి ఎర్రబెల్లిని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి.నాగయ్య, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్‌, ఐకేపీ వీఓఏ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాజ్‌కుమార్‌, ఎస్వీ రమ కలిశారు. ఐకేపీ వీఓఏలను సెర్ప్‌ ఉద్యోగులుగా గుర్తించాలనీ, కనీస వేతనం రూ.26వేలు, రూ.10 లక్షల బీమా సౌకర్యం, తదితర డిమాండ్లను నెరవేర్చాలని వినతిపత్రం అందజేశారు. ఈ సంందర్భంగా వారు మంత్రి దృష్టికి పలు అంశాలను తీసుకెళ్లారు.
44 రోజుల సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీని ప్రస్తావించారు. సమ్మె విరమణ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని వాపోయారు. గ్రామ మహిళా సమాఖ్యల ద్వారా పొదుపు సేకరణ, అనేక సంక్షేమ కార్యక్రమాల్లో అవిశ్రాంతంగా శ్రమిస్తున్న వీఓఏల పట్ల ఇలా వ్యవహరించడం తగదన్నారు. ఈ సందర్భంగానే వేతనాల పెంపు, ఇతర డిమాండ్ల పరిష్కారంపై సెర్ప్‌ ఉన్నతాధికారులను ఆదేశిస్తానని మంత్రి హామీ నిచ్చారు.

Spread the love