నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ లో ఓ బ్యాంకు మేనేజర్ ఘరానా మోసానికి ఒడిగట్టాడు. ఏకంగా బ్యాంకు మేనేజరే డబ్బులు కాజేశాడు. ఈ ఘటన నగరంలోని రామంతాపూర్ ఎస్‌బీఐ బ్యాంకులో చోటుచేసుకుంది. లక్ష కాదు.. రెండు లక్షలు కాదు.. ఏకంగా రూ.2.8 కోట్లు కొల్లగొట్టాడు. ఖాతాదారుల డాక్యుమెంట్లతో ఈ దారుణానికి పాల్పడ్డాడు. మేనేజర్ భార్య, కొడుకు ఖాతాలకు డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడు. మొత్తం 19 మంది డాక్యుమెంట్లను దగ్గర పెట్టుకొని, వారి పేర లోన్లు తీసుకున్నాడు. మోసం జరిగిందని గుర్తించిన ఖాతాదారులు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో మేనేజర్లు సైదులు, గంగమల్లయ్యపై కేసు నమోదైంది. ప్రస్తుతం వారిద్దరూ పరారీలో ఉన్నట్లు సమాచారం. పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.