ఎస్‌బీఐ సహా 3 బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్..

నవతెలంగాణ- హైదరాబాద్: దేశంలోని బ్యాంకుల పనితీరుపై ఎప్పటికప్పుడు నిఘా పెడుతుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఏ బ్యాంకైనా రూల్స్ అతిక్రమించినట్లు తెలిస్తే పెనాల్టీలతో పాటు లైసెన్స్ రద్దు చేసే అవకాశం సైతం ఉంటుంది. ఇన్నాళ్లు చిన్న చిన్న బ్యాంకులు, కోఆపరేటివ్ బ్యాంకులు రూల్స్ అతిక్రమించినట్లు వార్తల్లో చూసే ఉంటారు. కొన్నింటిపై భారీగా పెనాల్టీ వేయడం, కొన్నింటి లైసెన్సులు రద్దు చేసిన సంఘటనలా ఉన్నాయి. అయితే, ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా మరో 2 ప్రభుత్వ రంగ బ్యాంకులు నిబంధనలు ఉల్లంఘించాయటా. నిబంధనలు పాటించడంలో విఫలమైనట్లు గుర్తించిన క్రమంలో మూడు ప్రభుత్వ రంగ బ్యాంకులపై ఆర్‌బీఐ కొరడా ఝులిపించింది. భారీగా పెనాల్టీ విధించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు ఇండియన్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకులకు భారీగా పెనాల్టీ విధించింది రిజర్వ్ బ్యాంక్. రుణాలు, అడ్వాన్సులు- చట్టబద్ధ ఇతర పరిమితులు, ఇంట్రా గ్రూప్ ట్రాన్సాక్షన్లు, రుణాలకు సంబంధించిన మార్గదర్శకాలు పాటించడంలో విఫలమైన కారణఁగా ఎస్‌బీఐకి రూ. 1.30 కోట్లు జరిమానా విధించినట్లు ఆర్‌బీఐ తెలిపింది. అలాగే రుణాలు- అడ్వాన్సులతో పాటు కేవైసీ, 2016లో ఆర్‌బీఐ డిపాజిట్ల వడ్డీ రేట్లకు సంబంధించి జారీ చేసిన మార్గదర్శకాలను పాటించడంలో విఫలమైనందుకు ఇండియన్ బ్యాంకుకు రూ. 1.62 కోట్లు జరిమానా వేసింది. డిపాజిటర్ ఎడ్యుకేషన్, అవేర్‌నెస్ ఫండ్ స్కీమ్ విషయంలో నిబంధనలు పాటించలేదన్న కారణంగా పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకుకు రూ. 1 కోటి పెనాల్టీ వేసింది.

Spread the love