నవతెలంగాణ – న్యూఢిల్లీ: రూ.2,000 నోట్లు మార్చుకునేందుకు వచ్చే తమ బ్యాంకు కస్టమర్లకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది. నోట్ల మార్పిడికి ఎలాంటి ఐడీ కార్డులు, రిక్విజిషన్ ఫార్మ్‌లు సమర్పించాల్సిన అవసరం లేదని తెలిపింది. అయితే, ఒక్కోసారి పది నోట్లు (రూ.20,000 వరకూ) మార్చుకునే వెసులుబాటు మాత్రమే ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు అన్ని బ్రాంచ్‌లకు ఎస్‌బీఐ ఆదేశాలు ఇచ్చింది. కస్టమర్ల ఐడెంటిటీ ఫ్రూప్‌ను నిర్దారించే రిక్విజిషన్ స్లిప్‌ను పూర్తి చేయాలంటూ మే 19న ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకున్నామని, ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వచ్చిందని ఎస్‌బీఐ అన్ని బ్రాంచ్‌లకు సమాచారం ఇచ్చింది. కస్టమర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించింది. రూ.2,000 నోట్లను ఉపసంహరించుకున్నట్టు గత శుక్రవారంనాడు ఆర్బీఐ ప్రకటించింది. మార్కెట్‌లోని నోట్లను వెనక్కి తీసుకోవాలని, కొత్తగా నోట్లకు కస్టమర్లకు జారీ చేయవద్దని బ్యాంకులను ఆదేశించింది. సెప్టెంబర్ 30 వరకూ కస్టమర్లు తమ బ్యాంకు అకౌంట్లలో రూ.2,000 నోట్లు జమ చేసుకోవచ్చని, వేరే కరెన్సీ నోట్లు పొందవచ్చని కూడా ఆర్బీఐ స్పష్టం చేసింది. కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా ఇతర నోట్లు తగినన్ని అందుబాటులో ఉన్నందున రూ.2,000 నోట్లను మార్కెట్ నుంచి ఉపసంహరించుకుంటున్నట్టు ఆర్బీఐ వివరణ ఇచ్చింది.
ఆర్బీఐ 2016 నవంబర్‌లో రూ.2,000 నోట్లను ప్రవేశపెట్టింది. అదే నెలలో రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేయడంతో మార్కెట్ అవసరాలకు అనుగుణంగా రూ.2,000 నోట్లను తీసుకువచ్చింది. ప్రస్తుతం, ఇతర డినామినేషన్లలో కరెన్సీ నోట్లు తగినన్ని అందుబాటులో ఉన్నాయంటూ రూ.2,000 నోట్లను ఆర్బీఐ ఉపసంహరించుకుంది. దీనికి ముందస్తుగా 2018 నుంచి కొత్త రూ.2,000 నోట్లను ముద్రించడం నిలిపివేసింది.