నవతెలంగాణ – ఢిల్లీ: నగదు నిర్వహణలో భాగంగానే రూ.2,000 నోట్లను ఉపసంహరించుకుంటున్నామని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. నోట్ల మార్పిడికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని బ్యాంకులకు మార్గదర్శకాలు జారీ చేసినట్లు సోమవారం మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు. సెప్టెంబరు 30 నాటికి చాలా వరకు రూ.2,000 నోట్లు ఖజానాకు చేరతాయని తాము ఆశిస్తున్నట్లు శక్తికాంత దాస్ తెలిపారు. నోట్ల మార్పిడి సమయంలో ప్రజలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఆర్‌బీఐ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. నోట్ల మార్పిడి కోసం బ్యాంకుల వద్ద ప్రజలు హడావుడి పడాల్సిన అవసరం లేదని సూచించారు. నాలుగు నెలల సమయం ఉందని గుర్తు చేశారు. ప్రజలు దీన్ని సీరియస్‌గా తీసుకొని నోట్లన్నీ వాపస్ చేస్తారనే ఉద్దేశంతోనే అంత సమయం ఇచ్చామని తెలిపారు. కొందరు వ్యాపారులు గతకొంత కాలం నుంచే రూ.2,000 నోట్లను తిరస్కరిస్తున్నారన్నారు. ఉపసంహరణ ప్రకటన తర్వాత అది మరింత ఎక్కువై ఉంటుందని పేర్కొన్నారు.
రూ.50,000 కంటే ఎక్కువ మొత్తంలో చేసే డిపాజిట్లకు పాన్ సమర్పించాలనే నిబంధన ఇప్పటికే ఉన్నట్లు దాస్ గుర్తు చేశారు. ఆ నిబంధన రూ.2,000 నోట్ల డిపాజిట్లకూ వర్తిస్తుందని స్పష్టం చేశారు. రేపటి నుంచి బ్యాంకుల్లో నోట్ల మార్పిడి ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. రూ.2,000 నోట్ల స్థానంలో ఇతర నోట్లను ఇచ్చేందుకు తగినంత నగదు అందుబాటులో ఉంచామన్నారు. ఉపసంహరణ వల్ల ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చాలా తక్కువని తెలిపారు. చలామణిలో ఉన్న కరెన్సీలో రూ.2,000 నోట్ల వాటా కేవలం 10.18 శాతం మాత్రమేనని వెల్లడించారు. రూ.1,000 నోట్లను తిరిగి ప్రవేశపెట్టనున్నారని వస్తున్న వార్తలు కేవలం ఊహాగానాలేనని కొట్టిపారేశారు. గుర్తింపు కార్డులు లేకుండా డిపాజిట్లను అనుమతిస్తే.. నల్లధనాన్ని ఎలా గుర్తిస్తారనే ప్రశ్నకు దాస్ స్పందించారు. డిపాజిట్ల విషయంలో ఇప్పటికే అవలంబిస్తున్న నిబంధనలనే రూ.2,000 నోట్ల డిపాజిట్లకూ వర్తింపజేయాలని బ్యాంకులకు సూచించినట్లు తెలిపారు. పెద్ద మొత్తంలో అయ్యే డిపాజిట్లను తనిఖీ చేసే అంశాన్ని ఆదాయ పన్ను శాఖ చూసుకుంటుందని పేర్కొన్నారు. ఈ విషయంలో బ్యాంకులకు నిర్దిష్టమైన నిబంధనలను ఉన్నాయని.. వాటినే ఇప్పుడూ అమలు చేస్తాయని స్పష్టం చేశారు.