రైల్వే స్టేషన్‌ సమీపంలో బాలుడిని కొరికి చంపేసిన వీధికుక్కలు

నవతెలంగాణ – వరంగల్
వరంగల్ నగరంలో కుక్కల స్వైర విహారం చేస్తున్నాయి. రోజు రోజుకు పెరిగిపోతున్న కుక్కలబెడదతో జనం హడలిపోతున్నారు. బాబోయ్‌.. కుక్కలంటూ అటు వైపు వెళ్లాలంటే వాహనదారులు సైతం భయపడిపోతున్నారు.  ప్రధాన రహదారులు, వీధుల్లో కుక్కలు గుంపులు గుంపులుగా సంచరిస్తూ రోడ్డ పక్కన నడుచుకుంటూ వెళ్తున్న వారిపై దాడులు చేస్తున్నాయి. అలాగే ఇళ్ల ముందు ఆడుకుంటున్న పిల్లలు, రాత్రి వేళల్లో ఇళ్ల ముందు పడుకుంటున్న వారిపై దాడి చేసి కరుస్తున్నాయి. అలాగే ద్విచక్రవాహనదారులను వెంబడిస్తున్నాయి. అయినా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పట్టించుకోవడం లేదు. బయటకు రావాలంటేనే నగరవాసులు భయపడుతున్నారు.
కుక్కల దాడిలో సంచారజాతికి చెందిన ఓ బాలుడు చనిపోయాడు. శుక్రవారం ఉదయం కాజీపేట రైల్వే జంక్షన్‌ పరిధిలోని రైల్వే చిల్డ్రన్‌ పార్కు సమీపంలో బహిర్భూమికి వెళ్లిన చోటు (7)పై వీధికుక్కలు దాడి చేసి చంపడం నగరంలో కలకలం రేపింది. కాజీపేట పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలోని వారణాసి (బెనరాస్‌)కి చెందిన మలహర్‌ సింగ్‌- సునీత దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు. వీరిది సంచార జాతికి చెందిన కుటుంబం. వీరు రోడ్లపై గిల్ట్‌ ఉంగరాలు, చిన్నచిన్న వస్తువులు అమ్ముకుంటూ పొట్టపోసుకుంటారు. ఇలా మూడు కుటుంబాలవారు కాజీపేటకు వచ్చారు. సంచార జీవనంలో భాగంగా రాజస్తాన్‌లోని అజ్మీర్‌ వెళ్లేందుకు గురువారం రాత్రి కాజీపేట రైల్వే స్టేషన్‌కు వచ్చారు. రైలు లేకపోవడంతో గురువారం రాత్రి కాజీపేట రైల్వే చిల్డ్రన్స్‌ పార్కు ప్రహరీ పక్కన చెట్లు కింద సేద తీరారు. ఉదయం కుటుంబ పెద్దలు కూరగాయలు తెచ్చుకునేందుకు వెళ్లారు. మలహర్‌ సింగ్‌ కొడుకు చోటు పార్కు సమీపంలో బహిర్భూమికి వెళ్లగా వీధి కుక్కలు ఒక్కసారిగా అతడి మీద పడి దాడి చేశాయి. కింద పడేసి గొంతు, తల, ఇతర భాగాల్లో కొరికాయి. అటుగా వెళ్లినవారు చెదరగొట్టేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దాదాపు పది నిమిషాల పాటు చోటుపై దాడి చేసిన కుక్కలు స్థానికుల అరుపులతో అతడిని వదిలి పరుగులు తీశాయి. దగ్గరికి వెళ్లి పరిశీలించగా అప్పటికే బాలుడు ఊపిరి వదిలాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, చోటు మృతదేహాన్ని, అతడి కుటుంబ సభ్యులను ఎంజీఎం దవాఖానకు తరలించారు.
కుక్కల దాడిలో బాలుడు చనిపోయాడని తెలిసి చుట్టుపక్కలవారు చాలా మంది అక్కడికి చేరుకోగా, బాలుడి మృతదేహం వద్ద అతడి కుటుంబసభ్యులు రోదించిన తీరు చూపరులను కలిచివేసింది. అతడి చెల్లె ఏడుపు అందరి హృదయాలను ద్రవింపజేసింది. రైల్వే చిల్డ్రన్‌ పార్కు సమీపంలో వీధి కుక్కలు పెరిగాయని ఈ రోడ్డులో రాకపోకలు సాగించాలంటే భయంగా ఉందని స్థానికులు చెబుతున్నారు. గతంలోనూ పాచి పని చేసే ఓ మహిళ కొడుకును వీధి కుక్కలు కరిచాయని, అతడు నాలుగు నెలల తర్వాత చనిపోయాడని వాపోయారు. మున్సిపల్‌ అధికారులు స్పందించి కుక్కల బెదడ లేకుండా చేయాలని కోరారు.

Spread the love