నవతెలంగాణ – విజయనగరం
వాహనంతో ఢీకొట్టారు. అక్కడినుంచి 100 మీటర్లమేర ఈడ్చుకునిపోయారు. రోడ్డుపక్క రక్తపుమడుగులో విలవిల్లాడుతున్నా వదలలేదు. దాడిచేసి రాడ్లతో కొట్టారు. కర్కశంగా కళ్లు పొడిచేశారు. ఆ తర్వాత చంపేసి నెత్తుటి ముద్దగా మారిన మృతదేహాన్ని అక్కడ పడేసి పోయారు. విజయనగరం జిల్లా రాజాం మండలం కొత్తపేట సమీపంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిని హత్యచేసిన తీరు ఇది. టీడీపీ సానుభూతిపరుడైన ఆయన తనకు ఇలాంటి పరిస్థితి వస్తుందనే రెండేళ్ల క్రితం వైసీపీలోకి మారారు. అయినా.. రాజకీయ కక్షతో ఆయనను బలి తీసుకున్నారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు తెర్లాం మండలం ఉద్దవోలు గ్రామానికి చెందిన ఏగిరెడ్డి కృష్ణ (58) అదే మండలం కాలవరాజు పేటలో ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో శనివారం ఎప్పటిలాగే రాజాం నుంచి తన ద్విచక్ర వాహనంపై తెర్లాం మండలం కాలవరాజుపేట వైపు కృష్ణ బయలుదేరారు. అప్పటికే అక్కడ మాటువేసిన దుండగులు.. వ్యానుతో వెనగ్గా వెళ్లి కృష్ణ బైకును వేగంగా ఢీకొట్టారు. అంతే వేగంగా కృష్ణను వ్యానుతోపాటు ఈడ్చుకుంటూ పోయారు. తీవ్రగాయలతో రక్తపు మడుగులో కృష్ణ రోడ్డు పక్కన పడిపోయాడు. వాహనం నుంచి దిగిన వ్యక్తులు.. కృష్ణపై పడి రాడ్లతో బలంగా కొట్టారు. ఆపై కళ్లు పొడిచి హత్య చేశారు. వ్యానును అక్కడే వదిలేసి హంతకులు అక్కడినుంచి వెళ్లిపోయారు. అక్కడి పరిస్థితులను చూసి ఇది హత్యేనని కుటుంబసభ్యులు, గ్రామస్థులు ఘటనాస్థలం వద్ద బైఠాయించి ఆందోళనకు దిగారు. పోలీసులు విచారణ చేపట్టగా, హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారని నిర్ధారణ అయింది. మృతుడి కుమారుడు శ్రావణ్‌కుమార్ ఫిర్యాదు మేరకు ఉద్దవోలుకు చెందిన మరడాన వెంకటనాయుడు, మోహనరావు, గణపతి, రామస్వామిలపై కేసు నమోదు చేసినట్లు సీఐ రవికుమార్ తెలిపారు.
టీడీపీలో క్రియాశీలకంగా ఉండే కృష్ణ తెర్లాం మండలం ఉద్దవోలుకు 1988 నుంచి 1995 వరకు సర్పంచిగా చేశారు. 1998లో ఆయనకు ఉపాధ్యాయుడిగా ఉద్యోగం వచ్చింది. తర్వాత నుంచి గ్రామంలో ఈయన ఎవరికి మద్దతు తెలిపితే వారే సర్పంచిగా గెలిచేవారు. 2021 ఎన్నికల్లో ప్రస్తుత సర్పంచి సునీత ఈయన మద్దతుతో నెగ్గారు. తర్వాత వారిద్దరూ వైకాపాలో చేరారు. అప్పటికే వైకాపాలో ఉన్న వెంకటనాయుడు దీన్ని జీర్ణించుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో పథకం ప్రకారమే కృష్ణను హత్యచేసినట్లు ఆయన భార్య జోగేశ్వరమ్మ, కుమారుడు శ్రావణ్‌కుమార్, కుమార్తె ఝాన్సీతో పాటు బంధువులు ఆరోపిస్తున్నారు. కృష్ణను వాహనంతో ఢీకొన్న తర్వాత కొద్దిదూరం ఈడ్చుకెళ్లి రాడ్‌తో తలపై కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందినట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపినట్లు పోలీసులు వివరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజాం సామాజిక ఆసుపత్రికి తరలించారు.
కృష్ణ టీడీపీలో ఉండగా గ్రామానికి ఆనుకుని ఉన్న చెరువు గర్భంలో వెంకటనాయుడు తదితరులు సచివాలయ భవనం, ఆర్బీకే భవనాలు నిర్మించారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నారని గ్రామానికి చెందిన కొంతమంది హైకోర్టులో పిటిషన్ వేశారు. అప్పటికే సచివాలయం భవనానికి రూ.12 లక్షలు, ఆర్బీకేకు రూ.6 లక్షలు చెల్లింపులు జరిగాయి. హైకోర్టులో కేసు వేశాక రెండు భవనాల పనులూ నిలిచిపోయాయి. దీనికి కృష్ణే కారకుడని భావించి ఆయనపై వెంకటనాయుడు వర్గానికి చెందిన కొంతమంది డీఎస్సీలో అక్రమంగా ఉపాధ్యాయ పోస్టు సంపాదించారని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి పరస్పర ఫిర్యాదులు చేసుకుంటూనే ఉన్నారు.
‘గ్రామాలలో పరస్పరం కొట్టుకుని చచ్చిపోవడం చూశాను. కానీ, ఇలాంటి హత్యను 30 ఏళ్ల నా సర్వీసులో మొదటిసారి చూసిన్నట్లు డీఎస్పీ శ్రీనివాస చక్రవర్తి తెలిపారు. ఉద్దవోలు గ్రామానికి చెందిన ఏగిరెడ్డి కృష్ణకు….అదే గ్రామానికి చెందిన మరడాన వెంకటనాయుడు, మోహనరావులకు మధ్య రాజకీయ కక్షలున్నాయి. రాజకీయంగా ఎదుగుతున్న కృష్ణను అంతం చేయాలన్న కోరికతో ఓ పథకం ప్రకారమే ఆయనను హత్యచేశారు. కృష్ణ తన ద్విచక్ర వాహనంపై కాలవరాజుపేట పాఠశాలకు వెళ్తుండగా కొత్తపేట ప్రాంతంలో మరడాన మోహనరావు వాహనంతో ఢీకొట్టాడు. సుమారు 100 మీటర్ల వరకూ ఈడ్చుకుంటూ వెళ్లాడు. తీవ్ర గాయాలతో పడిపోయిన కృష్ణను రాడ్లతో కొట్టి చంపినట్టు కేసు నమోదు చేశాం’’