కాల్పుల విరమణ అమలు చేయాలి

– గాజా పరిస్థితులపై 800మందికి పైగా ఆరోగ్య నిపుణుల బహిరంగ లేఖ
గాజా : గాజాలో తక్షణమే కాల్పుల విరమణ అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ 800మందికి పైగా ప్రజారోగ్య రంగ నిపుణులు బహిరంగంగా ఒక లేఖ రాశారు. ఇజ్రాయిల్‌ నిరంతర దాడులతో గాజాలో సృష్టించిన ప్రజారోగ్య విపత్తు పట్ల వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవమైన ఏప్రిల్‌ 7న గాజాలో యుద్దానికి ఆరు మాసాలు పూర్తయిన సందర్భంగా ఈ లేఖను ప్రచురించారు. పీపుల్స్‌ హెల్త్‌ మూవ్‌మెంట్‌ (పిహెచ్‌ఎం), గ్రాస్‌రూట్స్‌ నెట్‌వర్క్‌ ఆఫ్‌ హెల్త్‌ వర్కర్స్‌, కార్యకర్తలు, సంస్థలు, అంతర్జాతీయ విద్యావేత్తలతో సహా పలు అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు ఈ లేఖను ధృవీకరించాయి. గాజాలో మనిషి సృష్టించిన కరువు కాటకాల పట్ల వారు తీవ్ర ఆందోళన వెలిబుచ్చారు. గాజాలో ఆరోగ్య మౌలిక సదుపాయాలను ఉద్దేశ్యపూర్వకంగా లక్ష్యంగా చేసుకోవడాన్ని వారు తీవ్రంగా నిరసించారు. ఈ సంక్షోభాలన్నింటి ప్రభాబంతో గాజాలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయిందని లేఖ పేర్కొంది. ఈ పరిస్థితులకు ఇజ్రాయిల్‌ బాధ్యత వహించాలని ఆ లేఖలో నిపుణులు స్పష్టం చేశారు. ఇజ్రాయిల్‌ నిరంతర దాడుల నుండి బతికి బట్ట కట్టినవారు ప్రజారోగ్యానికి సంబంధించిన పెను విపత్తును ఎదుర్కొంటున్నారని లేఖ ఆందోళన వ్యక్తం చేసింది. తక్షణమే గాజాలో బేషరతుగా, సుస్థిరంగా కాల్పుల విరమణ అమలు చేయాలని, ఆరోగ్య కార్యకర్తలకకు రక్షణ కల్పించాలని, ఆరోగ్య సదుపాయాలు అందుబాటులో వుండాలని, పరిశుభ్రమైన తాగునీరును పునరుద్ధరించాలని, పారిశుధ్య పరిస్థితులు మెరుగుపరచాలని, ఎలాంటి ఆటంకాలు లేకుండా మానవతా సాయం అందేలా చూడాలని ఆ లేఖలో కోరారు.

Spread the love