కోరలు తీసిన పాము పళ్లు లేని పులి

A fangless snake A toothless tiger– ఎన్నికల్లో ప్రభావం చూపని నోటా
– ఐదేండ్లలో ఓటేసింది 1.29 కోట్ల మందే
– మరోవైపు చట్టసభల్లో పెరుగుతున్న నేర చరితులు
న్యూఢిల్లీ : ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రం (ఈవీఎం)పై ‘నోటా’ బటన్‌కు అవకాశం కల్పించి పది సంవత్సరాలు దాటింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఈవీఎంలో నోటాను చేర్చారు. పోటీలో ఉన్న అభ్యర్థులు ఎవరూ నచ్చక పోతే ఓటరు నోటాను ఎంచుకోవచ్చు. అయితే ఈ అవకా శాన్ని ఉపయోగించుకుంటున్న ఓటర్ల సంఖ్య మాత్రం బాగా తక్కువగా ఉంటోంది.ఫలితాలపై దాని ప్రభావం ఏ మాత్రం లేకపోవడంతో పలువురు నిపుణులు నోటాను ‘పళ్ల్లు లేని పులి’, ‘కోరలు తీసిన పాము’గా అభివర్ణిస్తున్నారు.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2013లో నోటాను ప్రవేశపెట్టారు. కళంకిత అభ్యర్థులను బరిలో నిలపకుండా రాజకీయ పార్టీలను నిరుత్సాహపరచేందుకే ఈ ఆప్షన్‌ను తీసుకొచ్చారు. రంగంలో ఉన్న ఏ అభ్యర్థికీ ఓటు వేయరాదని ఓటరు నిర్ణయించుకున్నప్పుడు అతనికి ఉన్న ఏకైక అవకాశం నోటా. బ్యాలెట్‌ పత్రాలు, ఈవీఎంలలో నోటా ఆప్షన్‌ను ప్రవేశపెట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు అప్పట్లో ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. దీంతో ఈవీఎంలు, బ్యాలెట్‌ పత్రాలలో ఇందుకోసం ప్రత్యేకంగా ఓ గుర్తును కేటాయించారు. ఈవీఎంలో అభ్యర్థుల పేర్ల చివర నోటా బటన్‌ ఉంటుంది.
పెరుగుతున్న కళంకితులు
సుప్రీంకోర్టు ఆదేశాలకు ముందు ఏ అభ్యర్థికీ ఓటు వేయడం ఇష్టం లేని ఓటరు ఫామ్‌ 490ని పూర్తి చేయాల్సి వచ్చేది. అయితే ఎన్నికల నిర్వహణ నిబంధనల ప్రకారం పోలింగ్‌ కేంద్రంలో ఈ పత్రాన్ని నింపడం ఓటరు గోప్యత హక్కుకు భంగకరంగా ఉండేది. కాగా గత ఐదు సంవత్సరాల కాలంలో వివిధ రాష్ట్రాల శాసనసభలకు, లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో 1.29 కోట్ల మందికి పైగా ఓటర్లు నోటాను ఉపయోగించుకున్నారు. అదే సమయంలో నేర చరిత్ర కలిగిన అభ్యర్థుల సంఖ్య కూడా బాగా పెరిగింది. అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫామ్స్‌ (ఏడీఆర్‌) అనే సంస్థ ఇచ్చిన నివేదిక ప్రకారం గత దశాబ్ద కాలంలో క్రిమినల్‌ కేసులున్న ఎంపీల సంఖ్య బాగా పెరిగింది. 2009లో ఎన్నికైన ఎంపీల్లో 30% మంది నేరచరితులే. ఆ సంఖ్య తర్వాత బాగా పెరిగింది.
2009 ఎన్నికల్లో విజయం సాధించిన 543 మంది అభ్యర్థుల చరిత్రను ఏడీఆర్‌ విశ్లేషించింది. వీరిలో 162 మంది (30 శాతం) తమపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయని ప్రకటించారు. వారిలోనూ 76 మందిపై (14 శాతం) తీవ్రమైన క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. 2019 ఎన్నికల నాటికి క్రిమినల్‌, తీవ్రమైన క్రిమినల్‌ కేసులున్న ఎంపీల సంఖ్య వరుసగా 43 శాతం, 29 శాతానికి పెరిగింది. నేర చరితులను అడ్డుకునే విషయంలో నోటా వల్ల ప్రయోజనమేమీ కలగలేదని, వాస్తవానికి క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్న అభ్యర్థుల సంఖ్య పెరిగిందని ఏడీఆర్‌ అధిపతి రిటైర్డ్‌ మేజర్‌ జనరల్‌ అనిల్‌ వర్మ తెలిపారు.
రిజర్వ్‌డ్‌ స్థానాల్లో మెరుగు
ఓటరు తన అసమ్మతిని, రాజకీయ పార్టీల పట్ల తన ఆగ్రహాన్ని వ్యక్తం చేయడానికి నోటా అనేది ఓ వేదిక అని, అంతకంటే దానికి ప్రాధాన్యత ఏమీ లేదని వర్మ చెప్పారు. జనరల్‌ స్థానాలతో పోలిస్తే ఎస్సీ, ఎస్టీ రిజర్వ్‌డ్‌ స్థానాల్లో నోటాకు కొంచె ఎక్కువ ఓట్లు వచ్చాయని ఆయన తెలిపారు. ఆయా వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలను ఇది ప్రతిబింబిస్తోందని అన్నారు. నియోజకవర్గాల వారీగా చూస్తే మహారాష్ట్రలోని ఎస్సీ రిజర్వ్‌డ్‌ స్థానమైన లాతూర్‌ రూరల్‌లో అత్యధికంగా నోటాకు 27,500 ఓట్లు పడ్డాయి. మొత్తం పోలైన ఓట్లలో ఇది 13 శాతం కంటే ఎక్కువే. కాంగ్రెస్‌ అభ్యర్థి ధీరజ్‌ దేశ్‌ముఖ్‌కు 67 శాతం ఓట్లు రాగా రెండో స్థానం నోటాదే.
నేరచరితులు పోటీ పడిన స్థానాల్లోనూ అంతంతే
ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది నేరచరితు లు పోటీ చేసిన నియోజకవర్గాలకు సంబంధించి 2018 నుండి వివిధ రాష్ట్రాల శాసనసభలకు జరిగిన ఎన్నికల్లో నోటాకు 26,77,616 ఓట్లు పోలయ్యాయి. బీహార్‌లో అలాంటి 217 స్థానాల్లో నోటాకు 1.63 శాతం ఓట్లు లభించగా ఢిల్లీలో 0.43 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీహార్‌లోని ఎస్సీ రిజర్వ్‌డ్‌ స్థానమైన గోపాల్‌గంజ్‌లో నోటాకు అత్యధికంగా 51,660 ఓట్లు పడ్డాయి. పోలైన ఓట్లలో ఇది 5.03 శాతం.
నిపుణులు ఏమంటున్నారు?
నోటా ఆప్షన్‌కు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని యాక్సిస్‌ ఇండియా చైర్మెన్‌ ప్రదీప్‌ గుప్తా సూచించారు. నోటాపై పోటీ పడి ఓడిన వారు తిరిగి పోటీ చేయకుండా నిషేధం విధించాలని ఆయన అన్నారు. అప్పుడే ఎక్కువ మంది ఓటర్లు నోటాను కోరుకుంటారని చెప్పారు. ‘2014లో 1.08 శాతం, 2019లో 1.06 శాతం ఓటర్లు నోటాను ఎంచుకు న్నారు. ఇది మంచి సంఖ్యే. అయితే తిరస్కరణకు గురైన అభ్యర్థులు తిరిగి పోటీ చేయకూడదన్న నిబంధన తీసుకొస్తే నోటాను ఎంచుకునే వారి సంఖ్య పెరుగుతుంది’ అని తెలిపారు. అయితే ఇందుకు రాజకీయ పార్టీలు అంగీకరించ వని, కాబట్టి నోటా కోరలు తీసిన పాము వంటిదని వ్యాఖ్యా నించారు. కాగా నోటాను రద్దు చేయాలని కోరుకుంటున్న నేతలూ ఉన్నారు. ఛత్తీస్‌గఢ్‌ మాజీ ముఖ్యమంత్రి భూపేష్‌ బఘేల్‌ గత సంవత్సరం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో మాత్రం నోటాకు అవకాశం లేదని 2018లో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.
ఓట్ల శాతం తక్కువే
‘కళంకిత మంత్రులను పోటీకి దింపకుండా రాజకీయ పార్టీలపై ఒత్తిడి తెచ్చేందుకే నోటాను ప్రవేశపెట్టారు. అయితే అలా జరగలేదు’ అని అనిల్‌ వర్మ చెప్పారు. రాష్ట్రాల శాసనసభల ఎన్నిక లు, సార్వత్రిక ఎన్నికల్లో నోటాకు 0.5 శాతం నుంచి 1.5 శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో నోటాకు 1.06 శాతం ఓట్లు వచ్చాయి. 2018లో ఛత్తీస్‌గఢ్‌ శాసనసభ ఎన్నికల్లో నోటా కు అత్యధికంగా 1.98 శాతం ఓట్లు లభించాయి. నోటాకు పడిన అతి తక్కువ ఓట్ల విషయానికి వస్తే లక్షద్వీప్‌ లోక్‌సభ స్థానంలో 100 ఓట్లు మాత్రమే పడ్డాయి. 2020లో జరిగిన ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో నూ, 2018లో జరిగిన మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లోనూ నోటాకు దక్కింది కేవలం 0.46 శాతం ఓట్లే.

Spread the love