ఎన్నికల చౌరస్తాలో రైతు

A farmer at the election square– పోటాపోటీగా కాంగ్రెస్‌, బీజేపీ దీక్షలు
–  కరువు, భూగర్భజలాలు పడిపోవటంపై బీఆర్‌ఎస్‌ విమర్శనాస్త్రాలు
– నల్లచట్టాలు, ఎమ్‌ఎస్‌పీ గ్యారంటీ, రైతుల మరణాలే కాంగ్రెస్‌ అస్త్రాలు
– రైతుబంధు, రుణమాఫీపై ఫోకస్‌ పెట్టిన బీజేపీ
– కిషన్‌రెడ్డి రైతు దీక్షలో కార్యకర్తలదే హడావిడి
ఎన్నికలొస్తే చాలు రాజకీయ పార్టీలకు, నేతలకు అన్నదాత గుర్తుకువస్తారు.అదిగో ఇదిగో అంటూ ఎన్నో హామీలు గుమ్మరిస్తారు.ఓట్ల పండుగ అయ్యాక..ఇచ్చిన హామీలు..చెప్పిన మాటలు కనుచూపుమేరలో వినిపించవు. ఇపుడు సార్వత్రిక సమరంలో మరోసారి రైతన్నను ఎన్నికల చౌరస్తాలో నిలబెట్టారు. పోటాపోటీగా రైతులకోసం కాంగ్రెస్‌,బీజేపీ దీక్షలు చేస్తుంటే..తాను మాత్రం ప్రేక్షకుడిలా మారిపోయానని అన్నదాత లోలోన ఆవేదన చెందుతున్నాడు.
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
పంటలేయడం.. రక్షించుకోవడం కోసం అప్పులు తేవడం.. కోతకోయడం.. ఆపైన మార్కెట్‌లో తిప్పలు పడటం..’మద్దతు’ దక్కక అడ్డికి పావుసేరుకు అమ్ముకోవడం.. తినీ తినక మిగిలిన దాంట్లో ఎంతో కొంత అప్పు తీర్చడం…మళ్లీ కొంత పంట వేయటం కోసం సన్నద్ధం కావడం.. అన్నదాతల కాలచక్రం ఇదే. ప్రతి ఏటా జరిగే తంతూ ఇదే. పార్టీ ఏదైనా ఎన్నికల ముందు వాగ్దానాలే తప్ప ఏలుబడిలో వారికి చేసిందేమీలేదు. ఈ తంతు మారిందీ లేదు. కాగా, తాజా సార్వత్రికంలో రాజకీయ నేతలు తమ లబ్ది కోసం మరోసారి ఎన్నికల చౌరస్తాలో అన్నదాతలను నిలబెట్టారు. రైతుల కష్టాలను తీర్చిందేమీ లేకపోగా, వాటిని తమకు అనుకూలంగా మలుచుకుని ఓట్లుగా మార్చుకునే పనిలో పార్టీలు పడ్డాయి. అన్నదాతకు అసలు కారణాలేంటో అర్థం కాకుండా ఈ పరిస్థితులకు మీరంటే మీరే కారణమంటూ విమర్శనాస్త్రాలను ఎక్కుపెట్టి లబ్దిపొందే వేటలో పడ్డాయి. బీఆర్‌ఎస్‌ నేతలు ఎండిన పంటలను హైలెట్‌ చేస్తూ ‘కాంగ్రెస్‌ వచ్చింది.. కరువొచ్చింది’ అంటూ ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. గత ప్రభుత్వం ప్రాజెక్టుల విషయంలో చేసిన తప్పిదాలను కాంగ్రెస్‌ నేతలు ఎత్తిచూపుతున్నారు. తామొచ్చి నాలుగు నెలలే అవుతున్నదనీ, భూగర్భజలాలు అంతకంటే ముందే పడిపోయాయని చెప్పేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ కరీంనగర్‌లో దీక్షపెట్టి రైతులకు కేంద్ర ప్రభుత్వం ఏవిధంగా నష్టం చేకూరుస్తున్నదనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. వ్యవసాయాన్ని కార్పొరేట్లకు అప్పగించేందుకు మూడు నల్లచట్టాలను కేంద్రం తెస్తున్నదనీ, ఎమ్‌ఎస్పీ ధర అడిగితే ఇవ్వట్లేదనీ, చట్టాల రద్దు, ఎమ్‌ఎస్పీ కోసం ఢిల్లీ పురవీధుల్లో పోరుబాట పట్టిన అన్నదాతలపై కేంద్రం ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. 700మందికిపైగా అన్నదాతలను పొట్టనబెట్టుకున్న తీరును ఎండగడుతున్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పోటాపోటీగా రైతు కేంద్రంగా చేస్తున్న ఆందోళనతో ఉలిక్కి పడ్డ బీజేపీ నేతలు తామేమీ తక్కువ కాదన్నట్టుగా అన్నదాతల పల్లవి ఎత్తుకున్నారు. డిసెంబర్‌ 9న చేస్తానన్న రూ.2 లక్షల రుణమాఫీ, రైతులకు, కౌలు రైతులకు పంట సహాయం కింద ఇస్తామన్న రూ.15 వేలు ఏమయ్యాయంటూ ప్రశ్నించడం మొదలుపెట్టారు. బీఆర్‌ఎస్‌ నేతల వలే క్షేత్రస్థాయిలోకి మాత్రం వెళ్లడం లేదు. ఎన్నికల వేళ రైతుల ఆగ్రహం తమ పుట్టి ముంచుతుందని గ్రహించారో ఏమోగానీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డి హైదరాబాద్‌లోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలోనే సోమవారం రైతుదీక్ష నిర్వహించారు. ఆ దీక్ష ఎన్నికల షోను తలపించింది. ఆ దీక్షలో పట్టుమనీ పది మంది రైతులు కూడా కనిపించలేదు. హడావిడి అంతా ఆ పార్టీ కార్యకర్తలదే. కంకులు పోసి, కోతకొచ్చిన మూడు వరిపైర్ల కట్టలు తెచ్చి అక్కడ షో చేయడంపై విమర్శలొచ్చాయి. కిసాన్‌ సెల్‌ నాయకులు, అడ్వకేట్లే ఎక్కువగా కనిపించారు. మొక్కుబడిగా యాదాద్రి జిల్లా బొమ్మల రామారం మండలం హాజీపూర్‌ నుంచి కొందరు మహిళలను, వృద్ధులను తీసుకొచ్చి దీక్షలో కూర్చోబెట్టారు. ఇలా పోటీపడి దీక్షలు, విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టుకుంటున్నారే తప్ప దేశంలోని రైతాంగం ఈ స్థితిలో ఉండటానికి కారకులెవ్వరు? పర్యావరణ సమతుల్యత దెబ్బతినడానికి, భూగర్భజలాలు వేగంగా పడిపోవడానికి పాలకులు అనుసరిస్తున్న విధానాలు ఏవిధంగా కారణమవుతున్నాయి? ఎమ్‌ఎస్‌.స్వామినాథన్‌ సిఫారస్సులను ఎందుకు అమలు చేయడం లేదు? సబ్సిడీల్లో కోతలతో రైతులపై ఏవిధంగా భారాలు పెరిగిపోతున్నాయి? ఇలాంటి అంశాలను ఎక్కడా చర్చకు రానివ్వడంలేదు. సమస్యకు మీరంటే మీరే కారణమంటూ అన్నదాతల పట్ల తమ కపట ప్రేమను ఒలకబోస్తున్నారు. సమస్య మూలాల నుంచి ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారు.

Spread the love