ఫీజుల నియంత్రణ చట్టం చేయాలి

ఫీజుల నియంత్రణ చట్టం చేయాలి– ప్రభుత్వ పాఠశాలల్లో సరైన వసతుల్లేవ్‌..
– వ్యాపారంగా మారిన విద్య
– తమిళనాడు, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో బెస్ట్‌ ఫీజుల నియంత్రణ చట్టం :ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగరాజు
– ‘రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ చట్టం-ఆవశ్యకత’పై రౌండ్‌ టేబుల్‌ సమావేశం
నవతెలంగాణ-సిటీబ్యూరో/కాప్రా
రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగరాజు అన్నారు. మేడ్చల్‌-మల్కాజిగిరిలోని ఈసీఐఎల్‌ ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ‘రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ చట్టం – ఆవశ్యకత’ అనే అంశంపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి రాథోడ్‌ సంతోష్‌ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ప్రయివేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలని, చట్టం అమలు కోసం రాబోయే రోజుల్లో పెద్దఎత్తున పోరాటం రూపొందిస్తామని తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం నాగరాజు మాట్లాడుతూ.. ఫీజుల నియంత్రణ చట్టం తీసుకొస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించినా.. ఇప్పటి వరకు ఎలాంటి చొరవా చూపలేదన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 374 విద్యాసంస్థల్లో సర్వే చేసినట్టు తెలిపారు. ప్రజలు విద్యార్థుల ఫీజుల కోసం రూ.వందల కోట్లు ఖర్చు చేస్తున్నట్టు తేలిందన్నారు. ప్రభుత్వ విద్యారంగంపై తల్లిదండ్రులకు నమ్మకం లేకుండా పోయిందని, దీనికి కారణం అక్షరాలా రాష్ట్ర ప్రభుత్వమే అని చెప్పారు. ప్రభుత్వ స్కూళ్లలో సరైన సౌకర్యాలు, సరిపడా టీచర్స్‌ లేరన్నారు. ప్రయివేటు, కార్పొరేట్‌ స్కూల్స్‌ వర్క్‌షాప్స్‌ పేరుతో తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నాయని తెలిపారు. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాల్లో విద్య వ్యాపారమైందన్నారు. ఈ మూడు జిల్లాల్లోనే దాదాపు రూ.82వేల కోట్ల బిజినెస్‌ నడుస్తోందన్నారు. నర్సరీకే రూ.లక్ష నుంచి రూ.4 లక్షల వరకు వసూలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
15 రాష్ట్రాల్లో ఫీజుల నియంత్రణ చట్టం అమలులో ఉందని, వీటిని మోడల్‌గా తీసుకుని తెలంగాణలోనూ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. దేశంలోనే బెస్ట్‌ ఫీజుల నియంత్రణ చట్టం తమిళనాడు, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో అమల్లో ఉందన్నారు. విద్యా హక్కు చట్టం ప్రకారం ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ప్రయివేట్‌ విద్యాసంస్థల్లో 25 శాతం సీట్లు ఇవ్వాలని ఉన్నా అమలు కావడం లేదన్నారు.
ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర అధ్యక్షులు వెంకట్‌ మాట్లాడుతూ.. ప్రయివేటు, కార్పొరేట్‌ స్కూల్స్‌ రూ.వేల కోట్లు దోచుకుంటున్నాయన్నారు. ప్రభుత్వ స్కూల్స్‌ని అభివృద్ధి చేయడం లేదన్నారు. జేవీవీ రాష్ట్ర కార్యదర్శి వరప్రసాద్‌ మాట్లాడుతూ.. విద్యకు జీడీపీలో 6 శాతం నిధుల కేటాయింపు జరగాలని ప్రతిపాదిస్తే.. రాష్ట్ర ప్రభుత్వం 2.81 శాతం మాత్రమే కేటాయించినట్టు తెలిపారు.
అక్షరాస్యత పెరిగితే ప్రశ్నిస్తారనీ, ఎదురు తిరుగుతారనే కారణాలతోనే ప్రభుత్వాలు ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడం లేదని ఆరోపించారు. నేపాల్‌లో 77 శాతం, శ్రీలంకలో 92 శాతం, బాంగ్లాదేశ్‌లో 74 శాతం, పాకిస్థాన్‌లో 58 శాతం అక్షరాస్యత ఉందని తెలిపారు. జపాన్‌, రష్యాను ఏషియన్‌ టైగర్స్‌ అంటారని, ఎందుకంటే అక్కడ 99 శాతం అక్షరాశ్యత ఉందని అన్నారు. ఢిల్లీలో ప్రభుత్వ పాఠశాలలు చాలా బాగున్నాయని, తెలంగాణలోనూ అభివృద్ధి చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కార్తీక్‌, రాథోడ్‌ సంతోష్‌, ఐద్వా జిల్లా కార్యదర్శి ఎం.వినోద, నాయకులు శారద, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎర్ర అశోక్‌, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కన్వీనర్‌ అన్వర్‌, ఏఐఎస్‌ఎఫ్‌ కాప్రా మండల కన్వీనర్‌ సతీష్‌, ఏఐవైఎఫ్‌ జిల్లా కార్యదర్శి సత్యప్రసాద్‌, ఏఐవైఎఫ్‌ నాయకులు ప్రసాద్‌, మహేష్‌, స్ఫూర్తి గ్రూప్‌ బాధ్యులు శ్రీమన్నారాయణ, ఏఎస్‌రావు నగర్‌ విజ్ఞాన వేదిక నాయకులు యాదగిరిరావు, జేవీవీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు వంశీ, జిల్లా సహాయ కార్యదర్శులు అవినాష్‌, కార్తీక్‌, జిల్లా కమిటీ సభ్యులు మహేశ్వర్‌, శివ పాల్గొన్నారు.

Spread the love