– మాజీ ఉప రాష్ట్రపతి భైరాన్‌సింగ్ షెకావత్ అల్లుడి తిరుగుబాటు
– టికెట్ నిరాకరించటంతో నిరసనలు, ఆగ్రహజ్వాలలు
న్యూఢిల్లీ: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాజస్థాన్‌లో బీజేపీకి కొత్త తలనొప్పి ఎదురైంది. ఆ పార్టీ ఇప్పటికే తన మొదటి అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇదే ఇప్పుడు ఆ పార్టీలో నిరసనలు, ఆగ్రహ స్వరాలకు కారణమవుతున్నది. దాదాపు 12 ఎమ్మెల్యే స్థానాలకు పైగా ఇవే సీన్లు కనబడ్డాయి. టికెట్ దక్కని వారు తమదైన రీతిలో ఆందోళనలు చేస్తున్నారు. ఇది పరిస్థితి భారత మాజీ ఉపరాష్ట్రపతి భైరాన్‌సింగ్ షెకావత్ అల్లుడు నర్పత్ సింగ్ రాజ్వీకి ఎదరైంది. విద్యాధర్ నియోజకవర్గం నుంచి ఈయన మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే, ఈ సారి మాత్రం పార్టీ ఆయనకు టికెట్ నిరాకరించింది. ఈ నియోజకవర్గంలో ఆయన స్థానంలో ఎంపీ దియా కుమారికి అవకాశం కల్పించింది. ఇది నర్పత్ సింగ్‌కు ఆగ్రహాన్ని తెప్పించింది. పార్టీకి వ్యతిరేకంగా తిరుగుబాటు బావుటా ఎగురవేశారు.”భైరాన్ సింగ్ షెకావత్ వారసత్వాన్ని కించపరిచే వ్యూహం ఇది. నేను ఇక్కడి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ పార్టీ అభ్యర్థిని మార్చడం దిగ్భ్రాంతికరం. నేను బాధపడ్డాను. రాబోయే రోజుల్లో నా భవిష్యత్తు కార్యాచరణను నిర్ణ యిస్తాను” అని విద్యాధర్ నగర్ ఎమ్మెల్యే అన్నారు. బీజేపీ తొలి జాబితాలో 41 స్థానాలకు అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించిన విషయం విదితమే. ఇక అభ్యర్థుల ఎంపిక గందరగోళానికి దారి తీసిన స్థానాల్లో ప్రముఖమైనవి విద్యాధర్ నగర్, ఝోత్వా రా, కిషన్‌గఢ్, నగర్, టోంక్, సంచోర్, కోట్‌పుట్లీలు ఉన్నాయి. మొత్తమ్మీద పార్టీ తొలి జాబితాలో ఏడుగురు ఎంపీలను చేర్చుకున్నది. తిరుగుబాటు నేతలను సముదాయించి పార్టీ అభ్యర్థులపై పోటీ చేయకుండా నిరోధించేందుకు బార్మర్ ఎంపీ, కేంద్ర మంత్రి కైలాష్ చౌదరి ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేసినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
అసంతృప్తుల్లో ఎక్కువగా వసుంధర రాజే విధేయులు
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ నుంచి అధికారాన్ని చేజిక్కించుకోవాలని బీజేపీ 41 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. అయితే, బీజేపీలో టికెట్లు దక్కని వారు తమదైన రీతిలో ఆందోళనలు, నిరసనలను చేస్తున్నారు. ఇందులోనూ రాజస్థాన్ మాజీ సీఎం వసుంధర రాజే సింధియా వర్గీయులే అధికంగా ఉండటం గమ నార్హం. భైరాన్‌సింగ్ షెకావత్ అల్లుడు సైతం రాజేకు సన్నిహితుడే. ఇక జోత్వారా అభ్యర్థిగా తొలగించ బడిన తర్వాత వసుంధర రాజేను రాజ్‌పాల్‌సింగ్ షెకావత్ కూడా కలిశాడు. ఆయనే కాదు రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనితా గుర్జార్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించారు. తాను రాజేకు సన్నిహితురాలినైనందుకే తన పట్ల పార్టీ ఈ విధంగా వ్యవహరిస్తున్నదని అన్నారు. అయితే, ఈ పరిణామాలన్నీ బీజేపీకి రాబోయే ఎన్నికల్లో ప్రతి కూల ఫలితాలను తీసుకు వస్తాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.