ఏఐకేఎస్ అధ్యక్షులు అశోక్ ధావలె
ఏపీ కౌలు రైతు సంఘం రాష్ట్ర నాలుగో మహాసభ సందర్భంగా
ఉయ్యూరులో భారీ ప్రదర్శన
ఉయ్యూరు : కష్టపడి పంటలు పండిస్తున్న కౌలు రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండో తరగతి పౌరులుగానే పరిగణిస్తున్నాయని ఆల్ ఇండియా కిసాన్ సభ (ఎఐకెఎస్) అధ్యక్షులు అశోక్ ధావలే అన్నారు. కౌలు రైతుల సమస్యల పరిష్కారానికి, వారికి ప్రయోజనం చేకూర్చే చట్టాల సాధనకు దేశవ్యాప్త ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. నాలుగు రోజులపాటు జరిగే ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం రాష్ట్ర నాలుగో మహాసభను పురస్కరించుకుని ఆదివారం కృష్ణా జిల్లా ఉయ్యూరు పట్టణంలో ప్రదర్శన, బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో అశోక్ ధావలే మాట్లాడుతూ ప్రభుత్వాలు ఇప్పటి వరకు కౌలు రైతుల సంరక్షణకు ఒక్క చట్టం కూడా చేయకపోవడం దారుణమన్నారు. భూమి ఉన్న వారినే ప్రభుత్వాలు గుర్తిస్తున్నాయని, దీంతో, కౌలు రైతులకు బ్యాంకుల నుండి పంట రుణాలు అందడంలేదని వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పంటల పెట్టుబడి సాయం పథకాలు కూడా వీరికి అందించకుండా తీవ్ర అన్యాయం చేస్తున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 32 లక్షల మంది కౌలు రైతులుంటే కొద్దిమందికే గుర్తింపు కార్డులు ఇచ్చారని తెలిపారు. కౌలు, వడ్డీ, శ్రమ దోపిడీతోపాటు కనీస మద్దతు ధర అందక కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వివరించారు. ఈ దోపిడీకి వ్యతిరేకంగా, కౌలు రైతుల హక్కుల సాధనకు పోరాటాలను ఉధృతం చేయాలని పిలపునిచ్చారు. దేశంలో ఉదారవాద విధానాలు అమల్లోకి వచ్చాక పంటలకు మద్దతు ధర అందక కౌలు రైతులు, చిన్న, సన్నకారు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, లక్షల మంది ఆత్మహత్య చేసుకున్నారని వివరించారు. రైతాంగ సమస్యల పరిష్కారానికి స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను ప్రభుత్వాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. క్వింటాలు మొక్క జొన్నకు రూ.2,400 ధర ప్రకటిస్తే రూ.1,700కు, ధాన్యానికి రూ.2,369 ధర నిర్ణయిస్తే బీహార్‌తోపాటు అనేక రాష్ట్రాల్లో రూ.900 నుండి రూ.1200కు మాత్రమే కొనుగోలు చేశారని తెలిపారు. ప్రభుత్వాలు పంటలను సేకరించడంలేద న్నారు. దీనికి భిన్నంగా కేరళ రాష్ట్రం రైతుల ప్రయోజనాలను కాపాడు తోందని, ధాన్యానికి బోనస్ కలిపి రూ.3,000 ధర చెల్లిస్తోందని వివరించారు. రాజధాని అమరాతి అవుట్ రింగ్ రోడ్ కోసం 70 మీటర్లు అవసరంగా కాగా, ఎపి ప్రభుత్వం 250 మీటర్లకు నోటిఫికేషన్ ఇచ్చిందన్నారు. భూములు కోల్పోయే వారిలో 85 శాతం ఎకరంలోపే ఉన్న సన్నకారు రైతులేనని తెలిపారు.
రైతు సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ స్వామినాథన్ కమిటీ సిఫార్స్‌ల కన్నా తగ్గించి కనీస మద్దతు ధరలు నిర్ణయించడం, నిర్ణయించిన ధరకు కొనుగోలు చేయకపోవడంతో దేశంలో రైతులు, కౌలు రైతులు రూ.5 లక్షల కోట్లు నష్టపోతున్నారని వివరించారు. ఎపి రైతు సంఘం సీనియర్ నాయకులు వై కేశవరావు మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విబి గ్రామ్‌జీ పథకం వ్యవసాయ కార్మికుల ఉపాధికి తూట్లు పొడుస్తుందని, రాష్ట్రాలపై భారం పడుతుందని అన్నారు. ఎపి కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.హరిబాబు మాట్లాడుతూ అనేక పోరాటాల ఫలితంగా కౌలు రైతుల సమస్యలు రాష్ట్ర రాజకీయాల్లో అజెండాగా మార్చగలిగామన్నారు. ఇ-క్రాప్‌లో కౌలు రైతుల పేర్లు నమోదుకు అవకాశం కల్పించారని తెలిపారు. దేవాదాయ భూములు కౌలుకు చేసే వారికి గుర్తింపు కార్డులు, పంట రుణాలు ఇప్పించామన్నారు. కౌలు రైతులకు నష్టం చేసేలా వైసిపి ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని టిడిపి కూటమి ప్రభుత్వం కొనసాగిస్తోందని వివరించారు. కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షులు పంచకర్ల రంగారావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఎపి కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై.రాధాకృష్ణ, ఎపి రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె ప్రభాకరరెడ్డి, రాష్ట్ర నాయకులు బలరాం, ఎపి కౌలు రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎ లకీëశైలజ, జిల్లా అధ్యక్షులు టివి లక్ష్మణస్వామి, ఎపి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కె శివనాగేంద్రం తదితరులు పాల్గొన్నారు.
కదం తొక్కిన కౌలు రైతులు
కౌలు రైతుల సంఘం రాష్ట్ర మహాసభను పురస్కరించుకుని ఉయ్యూరులో ఆదివారం మహా ప్రదర్శన నిర్వహించారు. బస్టాండ్ సెంటర్, సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసు సెంటర్, పోలీస్ స్టేషన్ సెంటర్, మసీదు సెంటర్, మెయిన్ సెంటర్, వెంకటేశ్వర థియేటర్ మీదుగా వీరమ్మతల్లి గుడివరకు ప్రదర్శన సాగింది. 1.5 కిలోమీటర్లకుపైగా సాగిన ఈ ప్రదర్శనలో సంఘం రాష్ట్ర , జిల్లా నేతలు బ్యానర్‌తో అగ్రభాగాన నడిచారు. మార్కెట్ సెంటర్‌లో పెద్ద ముఠా కార్మికులు స్వాగతం పలికారు. మజ్జిగ పంపిణీ చేశారు. ఐద్వా, సిఐటియు, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు నేతలు సంఘీభావంగా ప్రదర్శనలో పాల్గొన్నారు. ప్రదర్శనలో గరికపర్రు బృందం తీన్మార్ వాయిద్యాలు, ఉంగుటూరు డప్పు కళాకారుల విన్యాసాలు, మొవ్వ మండలం అవిరిపూడి భజన సమాజం కోలాటం ఆకట్టుకున్నాయి.
కౌలు రైతుల సమస్యలపై దేశవ్యాప్త ఉద్యమం
- Advertisement -
- Advertisement -



