– ఆ నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమయ్యాయి?
– కొన్నది ఎవరు? ఏ పార్టీకి చేరాయి?
– వివరాలపై ఆసక్తి చూపని సుప్రీంకోర్టు
– వెల్లడించని ఎస్‌బీఐ, ఈసీ
న్యూఢిల్లీ : ఆరు సంవత్సరాలుగా గుప్పిట మూసిన రహస్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల పుణ్యమా అని ఎన్నికల బాండ్లకు సంబంధించిన సమాచారం దఫదఫాలుగా వెలుగులోకి వస్తోంది. అయితే ఈ సమాచారం పాక్షికమే. గందరగోళాన్ని కూడా సృష్టిస్తోంది. ఎందుకంటే 2019 ఏప్రిల్ 12వ తేదీకి ముందు నాలుగు వేల కోట్ల రూపాయల విలువ కలిగిన బాండ్ల లావాదేవీలు జరిగాయి. ఆ వివరాలు ఎప్పటికీ తెలిసే అవకాశం లేదు. సుప్రీంకోర్టు కూడా ఆ సమాచారాన్ని కోరడం లేదు. ఈ నెల 14, 17 తేదీలలో ఎన్నికల కమిషన్ కొంత సమాచారాన్ని అందించింది. ఈ నెల 21న మరిన్ని వివరాలు రాబోతున్నాయి. అయితే ఈ వివరాలన్నీ 2019 ఏప్రిల్ 12వ తేదీ నుండి ఈ ఏడాది జనవరి వరకూ జరిగిన లావాదేవీలకు సంబంధించినవే.
రెండు జాబితాలలో ఏముంది?
ఈ నెల 14న ఎన్నికల కమిషన్ రెండు జాబితాలను తన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది. 2019 ఏప్రిల్ 12వ తేదీ నుండి ఈ ఏడాది జనవరి వరకూ బాండ్లను కొనుగోలు చేసిన వారి వివరాలు తొలి జాబితాలో ఉన్నాయి. బాండును కొన్న తేదీ, దాని విలువ కూడా అందులో ఉంది. అత్యధికంగా బాండ్లను కొనుగోలు చేసింది ఓ లాటరీ కంపెనీ. మౌలిక సదుపాయాల కంపెనీలు, ఫార్మా కంపెనీలు కూడా ప్రధాన దాతలే. రిలయన్స్‌తో సంబంధమున్న సంస్థలు కూడా బాండ్లు కొనుగోలు చేశాయి. ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థల దాడుల తర్వాత 21 కంపెనీలు బాండ్లను కొనుగోలు చేసినట్లు ఈ జాబితా ద్వారా అర్థమవుతోంది. ఇక రెండో జాబితాలో… రాజకీయ పార్టీలు ఏ తేదీన, ఎంత విలువ కలిగిన బాండ్లను నగదుగా మార్చుకున్నదీ తెలియజేశారు. వివిధ రాజకీయ పార్టీలకు రూ.16,492 కోట్ల మేర విరాళాలు అందగా వాటిలో ఒక్క బీజేపీ ఖాతాకే రూ.8,250 కోట్లు చేరాయి. అయితే ఈ జాబితాలలో బాండ్లపై ఉండే యూనిక్ కోడ్ నెంబర్లు కన్పించలేదు. అదే విధంగా 2019 ఏప్రిల్ 12వ తేదీకి ముందు కొనుగోలు చేసిన బాండ్ల వివరాలు కూడా లేవు.
దాతల వివరాలు ఇచ్చిన పార్టీలు ఇవే
ఎన్నికల కమిషన్ ఈ నెల 17న అందజేసిన సమాచారంలో మాత్రం 2019 ఏప్రిల్ 12వ తేదీకి ముందు కొనుగోలు చేసిన బాండ్లకు సంబం ధించి కొన్ని వివరాలు కన్పించాయి. 2019- 2023 మధ్య వివిధ రాజకీయ పార్టీలు తనకు అందించిన నివేదికలను ఈసీ అప్‌లోడ్ చేసింది. ఇక్కడ గమనించాల్సిన విషయమేమంటే పలు పార్టీలు తాము ఏ తేదీన, ఎంత విలువ కలిగిన బాండ్లను నగదుగా మార్చుకున్నదీ ఈసీకి తెలియ జేశాయి.
డీఎంకే, అన్నా డీఎంకే, జనతాదళ్ (ఎస్) మాత్రమే దాతల పేర్లను వెల్లడించాయి. డీఎంకేకు లాటరీ కంపెనీ ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అత్యధికంగా విరాళం అందించింది. 2018లో జరిగిన కర్నాటక శాసనసభ ఎన్నికలకు ముందు జనతాదళ్ (ఎస్)కు ఇన్ఫోసిస్ కంపెనీ విరాళం ఇచ్చింది. అమ్‌ఆద్మీ, కాంగ్రెస్ పార్టీలు మాత్రం 2019లో తమకు విరాళాలు ఇచ్చిన దాతల పేర్లు మాత్రమే బయటపెట్టాయి.
బీజేపీ జేబులోకే…
కోడ్ తెలిసినప్పటికీ 2018 మార్చి, 2019 ఏప్రిల్ మధ్య కొనుగోలు చేసిన బాండ్ల సమాచారం మాత్రం అంతుచిక్కని రహస్యంగానే మిగిలిపోతుంది. 2019 ఏప్రిల్ 12వ తేదీకి ముందు జరిగిన లావాదేవీల సమాచారం బయటపెట్టాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు అభిప్రాయ పడింది. కానీ ఆ సమయంలో కొనుగోలు చేసిన బాండ్ల విలువ అక్షరాలా నాలుగు వేల కోట్ల రూపాయలు. లోక్‌సభ ఎన్నికలకు ముందు చేతులు మారిన ఆ సొమ్ములో అధిక భాగం బీజేపీ జేబులోకే చేరిందన్నది నిర్వివాదాంశం.
యూనిక్ కోడ్ తెలిస్తే…
ఎస్‌బీఐ నుండి ఇంకా ఎన్నికల కమిషన్‌కు అందాల్సిన సమాచారం చాలానే ఉంది. ముఖ్యంగా బాండ్ల యూనిక్ కోడ్లు తెలియాల్సి ఉంది. సుప్రీంకోర్టు తాజా ఆదేశాల మేరకు ఈ వివరాలన్నీ ఈ నెల 21న బయటపడే అవకాశం ఉంది. బాండ్ కోడ్ తెలిస్తే దానిని ఎవరు కొనుగోలు చేశారు? ఎవరికి అందజేశారు? ఏ పార్టీ దానిని నగదుగా మార్చుకుంది? వంటి ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయి. దాతలు, పార్టీల మధ్య క్విడ్‌ప్రోకో సంబంధాలు కూడా బయటపడతాయి.