హరితహారం లక్ష్య సాధనకు ప్రణాళికాబద్ధంగా కృషి : కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు

నవతెలంగాణ – కంటేశ్వర్
తెలంగాణకు హరితహారం కార్యక్రమం కింద నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో హరితహారం కార్యక్రమం పై అన్ని శాఖల జిల్లా అధికారులతో కలెక్టర్ గురువారం పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్, డీ.ఎఫ్.ఓ వికాస్ మీనాలతో కలిసి సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా 2025 – 2026 వార్షిక సంవత్సరానికి సంబంధించి ఆయా శాఖల వారీగా హరితహారం కింద నాటాల్సి మొక్కలకు సంబంధించిన లక్ష్యాలను నిర్దేశిస్తూ ప్రతిపాదనలు రూపొందించారు. ఈ ప్రతిపాదనలను ప్రభుత్వ ఆమోదం నిమిత్తం పంపడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఆయా శాఖల వారీగా కేటాయించిన లక్ష్యాన్ని పూర్తి స్థాయిలో సాధించేందుకు చొరవ చూపాలని కలెక్టర్ అధికారులకు హితవు పలికారు. దీనిని ప్రాధాన్యత అంశంగా తీసుకోవాలని, నిర్ణీత గడువు లోపు లక్ష్యం పూర్తి చేయాలని సూచించారు. 2023 – 2024 వార్షిక సంవత్సరానికి సంబంధించిన లక్ష్యాల సాధన కోసం క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ, హరితహారం అమలు తీరును పకడ్బందీగా పర్యవేక్షించాలన్నారు.  రోడ్లకు ఇరువైపులా ఖాళీ ప్రదేశాల్లో నాటిన మొక్కలను గమనించి వాస్తవ పరిస్థితులతో కూడిన నివేదికలు రూపొందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మొక్కలకు జియో ట్యాగింగ్ ప్రక్రియను కూడా పూర్తి చేయాలని సూచించారు. పచ్చదనం, పర్యావరణ పరిరక్షణతో ముడిపడిన హరితహారం కార్యక్రమానికి ప్రతి ఒక్కరు ప్రాధాన్యతనిస్తూ లక్ష్యాల సాధనకై పకడ్బందీ ప్రణాళికలు రూపొందించుకుని తదనుగుణంగా అంకితభావంతో కృషి చేయాలని హితవు పలికారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. నాటాల్సిన మొక్కల లక్ష్యాన్ని, నర్సరీల ద్వారా పంపిణీ చేసే మొక్కలతో కలపకుండా విడివిడిగా లక్ష్య సాధనకు కృషి చేయాలన్నారు. కాగా, పోలీస్ శాఖకు మొక్కలు పెంచేందుకు వీలుగా సరిపడా స్థలం లేనందున, నగర శివారులో ఐదెకరాల రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాను కేటాయిస్తామని, ఆ స్థలంలో మొక్కలు నాటేందుకు చొరవ చూపాలని డీ.ఎఫ్.ఓ వికాస్ మీనా కోరారు. ఈ సమావేశంలో నగర పాలక సంస్థ అదనపు కలెక్టర్ ఎం.మకరందు, అదనపు డీసీపీ ఎస్.జయరాం, ప్రొబేషనరీ ఐ.పీ.ఎస్ బి.చైతన్య, జెడ్పి సీ.ఈ.ఓ గోవింద్, డీఆర్డీఓ చందర్, డీపీఓ జయసుధ తదితరులు పాల్గొన్నారు.
Spread the love