ఆఫర్స్ పేరుతో స్కిన్ క్లినిక్స్ వ్యాపారం
చదివిన చదువుకు
చేసే చికిత్సకు సంబంధం లేదు..
గ్రేటర్‌లో పెరుగుతున్న
నకిలీ చర్మ సంబంధిత క్లినిక్స్
వ్యాపారమే లక్ష్యంగా రోగులకు టోకరా
తెలంగాణ వైద్యమండలి
తనిఖీలతో వెలుగులోకి..
చర్యలు తీసుకోవాలని డీఎంఅండ్‌హెచ్‌ఓకు సిఫారసు
నవతెలంగాణ-సిటీబ్యూరో
ప్రజల్లో అందం, కేశాల సంరక్షణ పట్ల పెరుగుతున్న శ్రద్ధను నకిలీ వైద్యులు సొమ్ము చేసుకుంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ నగరంలో అందం, కేశాల సంరక్షణ పేరిట నకిలీ స్కిన్ క్లినిక్‌లు, క్వాక్ లు (అర్హత లేని వ్యక్తులు) విపరీతంగా పెరిగిపోతున్నాయి. డెంటల్, ఆయుర్వేద, హోమియోపతి డాక్టర్లు, కనీస అర్హతల్లేని వ్యక్తులు మోసాలకు పాల్పడుతున్నారు. ప్రస్తుతం వెంట్రుకలు రాలటం, బట్టతల సమస్యలు, ముహంపై మొటిమలు, ముఖం జిడ్డుగా మారడం వంటి సమస్యలు తీవ్రమవుతుండటాన్ని కొందరు వ్యాపార వనరుగా మార్చుకుంటున్నారు. చదివిన చదువుకు చేసే చికిత్సకు సంబంధం లేకుండా నగరంలో ఇబ్బడి ముబ్బడిగా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్‌లు వెలుస్తున్నాయి. ఆఫర్ల పేరుతో బాధితులను ఊదరగొడుతూ ‘క్యాష్’ చేసుకుంటున్నా యి. ఇటీవల తెలంగాణ వైద్యమండలి తనిఖీల్లో ఇలాంటి మోసాలు వెలుగులోకి రావడంతో నాలుగు క్లినిక్ ల పై చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులకు సిఫార్సు చేశారు.
బూరిడీ కొట్టిస్తున్న క్లినిక్స్
‘మా క్లినిక్ లో చికిత్స తీసుకుంటే.. అందంగా మార్చేస్తాం.. యాంటి ఏజింగ్ చికిత్సలతో వయస్సు కన్పించకుండా చేస్తాం.. జుట్టు ఊడుతుందా..? తక్కువ సమయంలోనే తిరిగి జుట్టు పెరిగేలా చేస్తాం..’ అంటూ నగరంలో పలు చర్మ సంబంధిత క్లినిక్‌లు ఊదరగొడుతూ రోగులను బూరిడీ కొట్టిస్తున్నాయి. రోగులకు అవగాహన లేక చికిత్స తీసుకునేందుకు అర్హత ఉన్న క్లినిక్ లను ఎంపిక చేసుకోకపోవడాన్ని కొందరు ఆసరాగా చేసుకుని నమ్మబలుకుతున్నారు. ఏ వైద్యానికీ 100 శాతం గ్యారంటీ లేదని తెలిసినా.. రూ. 999కే లేజర్, రూ.2 వేలకే ఫుల్ బాడీ వైటెనింగ్ చేస్తామంటూ రోగుల అవసరాన్ని ‘క్యాష్’ చేసుకుంటున్నాయి. చర్మ సంబంధ వ్యాధుల నిపుణుల ఆధ్వర్యంలో చేయాల్సిన చికిత్సలను.. ఎలాంటి డిగ్రీ లేని వారు.. చర్మ సమస్యల చదువుతో సంబంధం లేని డిగ్రీలు చేసిన వారు అందిస్తూ దందా నడిపిస్తున్నారు. నగరంలో తరచూ జరుగుతున్న ఘటనలే ఇందుకు నిదర్శనం.
మోసం రకరకాలుగా..
డెర్మటాలజీలో డిప్లమో లాంటి కోర్సులు చేసిన వారే చికిత్స చేయడానికి అర్హులు. కానీ ఎలాంటి డిగ్రీలేని వ్యక్తులు, బ్యూటీషియన్లు, కాస్మటాలజిస్టులు, స్కిన్ స్పెషలిస్ట్ అని బోర్డులు పెట్టుకుని యథేచ్ఛగా చికిత్సలు చేసేస్తున్నారు. ఎండీ డెర్మటాలజీ, ఎఫ్ డీఏ అనుమతిలేని స్టెరాయిడ్ క్రీములు, హానికరమైన బ్లీచింగ్ ఏజెంట్లు, కొన్ని రకాల నకిలీ ఇంజక్షన్లు వాడుతున్నారు. చర్మ సమస్యలపై నిర్ధారణ రాకుండా స్టె రాయిడ్లు సిఫారసు చేస్తున్నారు. ముఖం మీద మొటిమలకు సైతం క్రీములు స్టె రాయిడ్ సూచిస్తు న్నారు. రకరకాల అందం చికిత్సలను లేజర్, బోటాక్స్ కు సరైన పరికరాల్లేకుండానే చికిత్స చేస్తున్నారు.
ఇటీవల తనిఖీలు ఇలా..
ఇటీవల నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ‘తెలంగాణ మెడికల్ కౌన్సిల్’ అధికారులు జరిపిన తనిఖీల్లో నకిలీ క్లినిక్ ల బండారం బయటపడింది. చర్మవ్యాధి నిపుణులు ప్లాస్టిక్ సర్జన్లు కాకుండా డెంటిస్ట్‌లు, ఆయుర్వేద, హోమియో డాక్టర్లు లేజర్ చికిత్సలు, కెమికల్ పీల్స్, హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేస్తున్నట్టు తేలింది. వారం రోజుల కిందట బంజారాహిల్స్‌లోని ఓ క్లినిక్ ఏకంగా డెంటిస్టులు, హోమియోపతి వైద్యులతో చర్మ సౌందర్య క్లినిక్ నడిపిస్తున్నట్టు తేలింది. ముగ్గురు డెంటల్, ఇద్దరు హోమియోపతి వైద్యుల ద్వారా చర్మ సంబంధిత చికిత్స అందిస్తున్నట్టు గుర్తించారు. రెండ్రోజుల కిందట కొండాపూర్ ప్రాంతంలోని పలు స్కిన్, హెయిర్ క్లినిక్‌లపై తనిఖీలు చేయగా.. డెర్మటాలజిస్ట్ లేకుండానే చర్మం, జుట్టుకు సంబంధించిన చికిత్సలు అందిస్తున్నారనీ, ఆ క్లినిక్‌కు కూడా అనుమతి లేదనీ తేలింది. మరో క్లినిక్‌లో కొన్ని ఎస్తేటిక్ విధానాలను దంత వైద్యులు (డెంటిస్టులు) నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. మరో క్లినిక్‌లో సరైన క్లినికల్ రిజిస్ట్రేషన్ లేకుండా, అర్హత గల డెర్మటాలజిస్టుల పర్యవేక్షణ లేకుండా, ఆన్‌లైన్ సంప్రదింపుల ద్వారా జుట్టు రాలడం సమస్యలకు చికిత్స అందిస్తున్నట్టు గుర్తించారు. ఇలాంటి క్లినిక్స్ ఎక్కువగా కొండాపూర్, కూకట్‌పల్లి, మాదాపూర్, మియాపూర్, గచ్చిబౌలి, బంజారాహిల్స్ , జూబ్లిహిల్స్, దిలుసుఖ్‌నగర్, హైటెక్ సిటీ వంటి ఏరియాల్లో వెలుస్తున్నాయి. చర్మ క్లినిక్స్ (డెర్మటాలజీ క్లినిక్స్)లో కొన్ని చోట్ల జరుగుతున్న మితిమీరిన వ్యాపార ధోరణి (దందా) లేదా మోసాల గురించి అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యం.



