బాలికకు మెరుగైన వైద్య సౌకర్యం కల్పించాలి
‘ఖమ్మం’ ఘటనపై హైదరాబాద్ ఎస్వీకే వద్ద ప్రజా సంఘాల నిరసన ర్యాలీ
కుటుంబానికి భద్రత కల్పించి, ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఖమ్మంలో బాలికపై లైంగిక దాడికి యత్నించటమే కాకుండా హత్యాయత్నం చేసిన నిందితుడు గౌస్ పాషాను ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ద్వారా కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద నిరసనా ర్యాలీ నిర్వహించాయి. ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ.అబ్బాస్, గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.శ్రీరామ్ నాయక్, డీవైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనగంటి వెంకటేష్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి బొప్పని పద్మ, కేవీపీఎస్ రాష్ట్ర నాయకులు మహేందర్, రజక వృత్తి దారుల సంఘం రాష్ట్ర నాయకులు మిర్యాల గోపాల్ లు బాలికకు మెరుగైన వైద్య సౌకర్యం కల్పించాలనీ, కుటుంబానికి భద్రత కల్పించాలనీ, ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా రూరల్ మండలం తల్లంపాడు గ్రామానికి చెందిన నిరుపేద బాలిక సెలవుల నిమిత్తం రజక వృత్తి దారులైన అమ్మమ్మ తాతయ్య ఇంటికి వచ్చిందని తెలిపారు.
వారు ఖమ్మం నగరంలోని రాపర్తి నగర్ జి ఫైవ్ అపార్ట్మెంట్ లో వాచ్ మెన్ గా పని చేస్తున్నారని పేర్కొన్నారు. అదే అపార్ట్ మెంట్ లో ఉంటున్న మహమ్మద్ గౌస్ పాషా (49) బాలికపై లైంగిక దాడికి యత్నించాడనీ, ఆ విషయం బయటపడకూడదనే ఉద్దేశంతో ఆ చిన్నారిని బలవంతంగా నాలుగో అంతస్తుకు తీసుకెళ్లి కిందికి నెట్టి హత్యాయత్నం చేశాడని తెలిపారు. ఈ ఘటనను ప్రజాసంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయని పేర్కొన్నారు. ఘటన జరిగి వారం రోజులు గడుస్తున్నా సీఎం ఎందుకు స్పందించటం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో వరసగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయనీ, యువతులకు, మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు ఆర్ అరుణ జ్యోతి, గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ధర్మానాయక్, డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్,నాయకులు కృష్ణ నాయక్, శశి కళ, కవిత, రజిత, సంగీత,సోమయ్య, నరేష్, వెంకన్న,కనకయ్య, కవిత, ఎం జ్యోతి, పి ఎల్లమ్మ, రజిత, ఇందిరా, ప్రేమ, జోషిలా, సంగీత, బ్రాహ్మణి తదితరులు పాల్గొన్నారు.
మహిళా కమిషన్‌కు వినతి
ఖమ్మంలో బాలికపై లైంగిక దాడి యత్నం ఘటనపై శుక్రవారం రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గద్వాల విజయలక్ష్మిని ప్రజాసంఘాల బృందం కలిసి వినతి పత్రాన్ని అందించింది. బాలిక కోలుకునే వరకు మెరుగైన వైద్యం అందించాలని కోరింది. అదే విధంగా బాధితురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేసింది.



