Tuesday, June 9, 2026
E-PAPER
Homeజిల్లాలుఆర్ఓబి బ్రిడ్జిపై వరుస ప్రమాదాలు.. అధికారుల నిర్లక్ష్యమే కారణం

ఆర్ఓబి బ్రిడ్జిపై వరుస ప్రమాదాలు.. అధికారుల నిర్లక్ష్యమే కారణం

- Advertisement -

ఆర్ఓబి బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదంలో మరణించిన ఎర్ర ఉదయ్, సుంకరి శ్రీనాథ్ లకు నివాళులు అర్పించిన సీపీఐ(ఎం)
ఎంఏ ఇక్బాల్ సీపీఐ(ఎం) జిల్లా నాయకులు
నవతెలంగాణ – ఆలేరు రూరల్

ఆలేరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయానికి ఎదురుగా ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్ఓబి)పై వరుసగా ప్రమాదాలు జరుగుతూ ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సీపీఐ(ఎం) జిల్లా నాయకులు ఎం.ఏ. ఇక్బాల్ మండిపడ్డారు. మంగళవారం ఆర్ఓబి బ్రిడ్జిపై ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన ఎర్ర ఉదయ్, సుంకరి శ్రీనాథ్‌లకు ప్రమాద స్థలంలో సీపీఐ(ఎం) పట్టణ నాయకత్వం నివాళులర్పించి నిరసన వ్యక్తం చేసింది. సందర్భంగా ఎం.ఏ. ఇక్బాల్ మాట్లాడుతూ ఆలేరు ఆర్ఓబి నిర్మాణం జరిగినప్పటి నుంచి అనేక ప్రమాదాలు చోటుచేసుకున్నాయని, పలువురు వికలాంగులుగా మారగా మరికొందరు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. అయినప్పటికీ ఆర్‌అండ్‌బి,మున్సిపల్ శాఖ అధికారులు సమస్యను గుర్తించి తగిన చర్యలు చేపట్టడంలో విఫలమయ్యారని విమర్శించారు. ప్రజల ప్రాణాలకు విలువ ఇవ్వకుండా అధికారులు వ్యవహరిస్తున్నారని, ప్రమాదాల్లో కుటుంబాలే దెబ్బతింటున్నా పాలక వ్యవస్థ స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు.

మంతపురి రోడ్డు నుంచి బ్రిడ్జిపైకి ఎక్కే ప్రాంతంలో ఇరువైపులా ఉన్న ప్రహరీ గోడలు ఎత్తుగా ఉండటంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించడం లేదని తెలిపారు. దీనివల్ల ద్విచక్ర వాహనాలు, కార్లు తరచుగా ప్రమాదాలకు గురవుతున్నాయని పేర్కొన్నారు. అలాగే ప్రహరీ గోడల సమీపంలో జరిగిన ఆక్రమణలను తొలగించి, గోడల ఎత్తును తగ్గించాలని డిమాండ్ చేశారు. గోడలకు ఇరువైపులా తగినంత స్థలం ఉన్నప్పటికీ లింక్ రోడ్లను విస్తరించకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.

బ్రిడ్జిపై వెంటనే ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని, రేడియం డివైడర్లు, బటర్‌ఫ్లై లైట్లు అమర్చాలని, రాత్రి వేళల్లో ప్రమాద హెచ్చరికలు స్పష్టంగా కనిపించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పై నుంచి వస్తున్న వాహనాలు కింద నుంచి ఎక్కే వాహనదారులకు స్పష్టంగా కనిపించే విధంగా రహదారి నిర్మాణంలో మార్పులు చేయాలని సూచించారు. ప్రభుత్వ అధికారులు తక్షణమే స్పందించి భద్రతా చర్యలు చేపట్టకపోతే రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన కుటుంబ సభ్యులతో కలిసి జిల్లా కలెక్టర్‌ను కలిసి ఆర్‌అండ్‌బి, మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంపై ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) పట్టణ నాయకులు మొరిగాడి రమేష్, వడ్డెమాను బాలరాజు, మొరిగాడి అజయ్‌కుమార్, రాజేష్,కాసుల నరేష్, డీవైఎఫ్‌ఐ నాయకులు మాదాని నవీన్, యాసారపు ప్రసాద్, ఎస్‌ఎఫ్‌ఐ మండల అధ్యక్షుడు మద్దెల సాయినాథ్, మొరిగాడి అంజయ్య, ఘణగాని రాజు, ఎండీ మతీన్, ఎండీ ఖలీల్, కటకం సుదర్శన్, గొడుగు దాసు, కొరుటూరి ఉపేందర్, ఎగ్గిడి స్వామి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -