Monday, April 27, 2026
E-PAPER
Homeజాతీయంబెహలాలో ఉత్సాహభరితమైన రోడ్‌షో

బెహలాలో ఉత్సాహభరితమైన రోడ్‌షో

- Advertisement -

పాల్గొన్న సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ, సీనియర్‌ నాయకురాలు బృందాకరత్‌
నవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరో

సాయంకాలం అవుతోంది. మధ్యాహ్నపు సూర్యుడు ఆకాశంలో కనిపించకపోయినా పశ్చిమబెంగాల్‌లోని బెహలా కూడలి ఎర్రగా వెలిగిపోతోంది. వందలాది మంది ప్రజలు చేతుల్లో ఎర్ర జెండాలు పట్టుకుని ఊరేగింపు కోసం ఎదురుచూస్తూ నిలబడి ఉన్నారు. ఎర్ర జెండాలతో పాటు, కొందరి చేతుల్లో ఎర్ర బెలూన్లు కూడా ఉన్నాయి. అక్కడ జనసమూహం ఎంత భారీగా ఉందంటే, దాన్ని మొదలు నుంచి చివరి వరకు ఒక్కచూపులో చూడటం సాధ్యం కాదు. అయితే, ప్రజల సహజసిద్ధమైన ఉత్సాహం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా, ఊరేగింపులో ముందు వరుసలో ఉన్న మహిళలతో సహా విద్యార్థులు, యువత చూపిన ఉత్సాహం కండ్లు తిప్పుకోకుండా చేసింది.

సీపీఐ(ఎం) తరఫున బరిలో నిలిచిన బెహలా తూర్పు అభ్యర్థి నీలోరు మజుందార్‌, పశ్చిమ అభ్యర్థి నిహార్‌ భక్తకు మద్దతుగా బెహలా కూడలి నుంచి ఠాకూర్‌పుకూర్‌ వరకు ఒక భారీ ఊరేగింపు నిర్వహించారు. ఈ ఊరేగింపులో పార్టీ ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ, సీనియర్‌ నాయకురాలు బృందా కరత్‌ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంఏ బేబీ మాట్లాడుతూ వామపక్షాలకు బెంగాల్‌ ప్రజల స్పందన చూస్తుంటే వామపక్ష పునరుజ్జీవన మార్గం క్రమంగా విస్తరిస్తోందన్నారు. వామపక్ష పునరుజ్జీవన లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్నికల్లో పోరాడుదామని పిలుపునిచ్చారు. వివిధ ప్రదేశాల్లో ప్రజల ఆకస్మిక స్పందన కూడా చూశామని, ఆ ఉత్సాహం బెంగాల్‌లో వామపక్షాల విజయం ఖాయమని చెబుతోందని ఆయన అన్నారు. తృణమూల్‌కు చెందిన పార్థా ఛటర్జీ చాలాకాలం పాటు బెహలా ఎమ్మెల్యేగా ఉన్నారని, విద్యావ్యవస్థలో ఆయన చేసిన అవినీతి వల్ల జైలు జీవితం అనుభవించి, ప్రస్తుతం బయట ఉన్నప్పటికీ ప్రజలు వారికి వ్యతిరేకంగానే ఉన్నారన్నారు. దీంతో పాటు మత ధ్రువీకరణ రాజకీయాలూ ఉన్నాయన్నారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ హింసాత్మక, అవినీతి రాజకీయాలకు, బీజేపీ విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా బెంగాల్‌ ప్రజలు ఈసారి తీర్పును రాయబోతున్నారన్నారు. మత, విభజన రాజకీయాలను వామపక్షాలు మాత్రమే ఎదిరించగలవని ఆయన స్పష్టం చేశారు. వామపక్ష కూటమికి యువత పెద్ద సంఖ్యలో మద్దతుగా నిలుస్తున్నారన్నారు.

సీపీఐ(ఎం) సీనియర్‌ నాయకురాలు బృందా కరత్‌ మాట్లాడుతూ వామపక్ష పాలనలో రాష్ట్రంలో మత కలహాలు లేవని, ఇప్పుడు అవి హింసను ప్రేరేపిస్తోన్నాయన్నారు. టీఎంసీ, బీజేపీలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. అభ్యర్థి నీలోరు మజుందార్‌ మాట్లాడుతూ తృణమూల్‌ అవినీతి గురించి ఈ ప్రాంత ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. పిల్లల భవిష్యత్‌, ప్రజాపక్షపాత పాలన కోసం వామపక్షాలను విశ్వసించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజలకు చేయాలనుకున్న అభివృద్ధి గురించి మ్యానిఫెస్టో రూపొందించామని, ప్రజల నుంచి ఇందుకు అనూహ్య స్పందన వచ్చిందని ఆయన వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -