వాషింగ్టన్ : ట్రంప్ ప్రభుత్వం మరో ఉన్నత స్థాయి అధికారికి ఉద్వాసన పలకబోతోంది. ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్‌పై అమెరికా ప్రభుత్వం వేటు వేయబోతోందని తెలుస్తోంది. వైట్‌హౌస్ కరస్పాండెంట్ల విందు కార్యక్రమంలో కాల్పుల ఘటన జరగడానికి ముందు ఈ వార్త బయటికి వచ్చింది. తొలగింపు అనివార్యమని, అది ఎప్పుడైనా జరగవచ్చునని శ్వేతసౌధం అధికారిని ఉటంకిస్తూ పొలిటికో వార్తా సంస్థ తెలిపింది. భారతీయ సంతతికి చెందిన కాష్ పటేల్ చుట్టూ ఇటీవలి కాలంలో వివాదాలు అలముకున్నాయి. పటేల్ చుట్టూ ఒత్తిడి పెరుగుతోందని, ఆయన కొద్ది కాలం మాత్రమే పదవిలో ఉంటారని పొలిటికోకు చెందిన డాష్ బర్న్‌్ చెప్పారు. ఆయనకు వ్యతిరేకంగా అనేక కథనాలు వచ్చాయని, క్యాబినెట్ కార్యదర్శిగా ఆయన పనికిరారన్న అభిప్రాయం వ్యక్తమవుతోందని అన్నారు. పటేల్ పనితీరుతో ట్రంప్ విసిగిపోయారని తెలిపారు. కాగా పటేల్ ఇప్పటికే న్యాయస్థానాలలో పలు వ్యాజ్యాలను ఎదుర్కొంటున్నారు. మీడియాలో కూడా ఆయనపై కథనాలు వచ్చాయి. పటేల్ మితిమీరి మద్యం తీసుకుంటారని, కార్యాలయంలో తన సహచరులను ఇబ్బంది పెడతారని, అత్యవసర సమావేశాలకు తరచుగా డుమ్మా కొడతారని ‘ది అట్లాంటిక్’ పత్రికలో జర్నలిస్టు సారా ఫిట్జ్‌పాట్రిక్ ఓ వార్త రాశారు. దీనిపై మండిపడిన పటేల్ ఆ పత్రికపై నష్టపరిహారం కోరుతూ దావా వేశారు.
ట్రంప్ ప్రభుత్వం నుంచి ఎఫ్‌బీఐ డైరెక్టర్‌కు ఉద్వాసన ?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



