– కో-ఆప్షన్ సభ్యురాలిగా ఎన్నికైన మహిళా సంఘం నాయకురాలు తగరం నిర్మల
నవతెలంగాణ – అశ్వారావుపేట : అశ్వారావుపేట మున్సిపాలిటీ పాలకవర్గంలో సీపీఐ(ఎం)కు సముచిత స్థానం లభించింది. శనివారం జరిగిన మున్సిపాలిటీ కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికలో క్రైస్తవ మైనారిటీ విభాగం నుంచి సీపీఐ(ఎం) ప్రతినిధిగా మహిళా సంఘం నాయకురాలు తగరం నిర్మల కో-ఆప్షన్ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. మున్సిపాలిటీ పరిధిలోని అనేక కాలనీలు, ఆవాసాల్లో నేటికీ అపరిష్కృతంగా ఉన్న ప్రజా సమస్యలను పాలకవర్గం దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి కృషి చేసే అవకాశం పార్టీకి దక్కిందని సీపీఐ(ఎం) నాయకులు పేర్కొన్నారు. ఈ ఎన్నికతో పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.
తగరం నిర్మల గతంలో సీపీఐ(ఎం) తరఫున జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్‌గా బరిలో నిలిచినప్పటికీ విజయం సాధించలేకపోయారు. అయితే ప్రస్తుతం కో-ఆప్షన్ సభ్యురాలిగా ఎన్నిక కావడం ద్వారా ప్రజా సేవకు మరో అవకాశం లభించిందని పార్టీ నాయకులు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా నిర్మలను సీపీఐ(ఎం) నాయకులు, కార్యకర్తలు అభినందిస్తూ, ప్రజా సమస్యల పరిష్కారంలో ఆమె చురుకైన పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.



