ఆప్ ఎంపీ ఈడీ కస్టడీ పొడిగింపు

నవతెలంగాణ -న్యూఢిల్లీ: ఎక్సైజ్ కుంభకోణానికి చెందిన మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ కస్టడీని ఈనెల 13వ తేదీ వరకూ ఢిల్లీ కోర్టు  ఈ రోజు పొడిగించింది. 2021-22 ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో సంజయ్ సింగ్‌ను అక్టోబర్ 4న ఈడీ అరెస్టు చేసింది. కోర్టుకు హాజరయ్యే మందు మీడియాతో మాట్లాడవద్దని, ఇందువల్ల భద్రతా సమస్యలు తలెత్తవచ్చని సంజయ్ సింగ్‌ను కోర్టు ఆదేశించింది. కస్టడీ పొడిగింపు ఆదేశాలను ప్రకటించే ముందు ఆయనను తన కుటుంబ సభ్యులు, లాయర్‌తో రెండు నిమిషాల పాటు మాట్లాడేందుకు కోర్టు అనుమతించింది. నిజాయితీ కలిగిన వ్యక్తులు తమతోనే ఉన్నారని, అవినీతిపరులు మోడీతో ఉన్నారని సింగ్ మీడియా ముందు వ్యాఖ్యానించారు. కాగా, ఈడీ కోర్టు ముందు తమ వాదన వినిపిస్తూ, ఈ కేసులో పెద్దఎత్తున నగదు లావాదేవీలు జరిగాయని తెలిపింది. సంజయ్ సింగ్ రిమాండ్‌ను పొడిగించాలని కోరింది. అయితే సంజయ్ సింగ్ న్యాయవాది రెబెక్కా జాన్ ఈ వాదనను తోసిపుచ్చారు. రిమాండ్ పేపరులో ఏమీ లేనందున తిరిగి రిమాండ్ అవసరం ఏముందని ప్రశ్నించారు.

Spread the love