– యురేక, ఫాల్కన్ పేరుతో అటానమస్ డ్రోన్లు
– విపత్తుల వేళ అండగా..
– విద్యార్థులకు పలువురి ప్రశంసలు
నవతెలంగాణ-ఓయూ
విపత్తుల వేళ ఉపయోగించేలా రెండు రకాల ”అటానమస్ డ్రోన్లను” హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు తయారు చేసి సత్తా చాటారు. ఓయూలో వీటిని తయారు చేయడం ఇదే మొదటిసారి కావడం విశేషం. తాజాగా ఈ డ్రోన్లను తమిళనాడు చెన్నరులోని కేసీజీ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్న అటానమస్ డ్రోన్ డెవలప్‌మెంట్ చాలెంజ్ – 2023 (ఏడీడీసీ)లో ప్రదర్శించారు. ప్రొ.ఉమామహేశ్వర్ పర్యవేక్షణలో కళాశాలలోని సొసైటీ ఆఫ్ ఆటోమేటివ్ ఇంజినీర్స్, ఇండియా (ఎస్‌ఏఈ ఇండియా) క్లబ్ సభ్యులైన విద్యార్థులు ఈ డ్రోన్(యురేకా, ఫాల్కోన్స్)లను రూపొందించారు. సీఎస్‌ఈ, ఈసీఈ, ఈఈఈ, మెకానికల్, మైనింగ్ విభాగాలకు చెందిన మూడు, నాలుగో సంవత్సరానికి చెందిన 10 మంది విద్యార్థులతో కూడిన బృందం పాల్గొంది. ఈ సందర్భంగా విద్యార్థులను కళాశాల ప్రిన్సిపల్ ప్రొ.శ్రీరాం వెంకటేశ్, క్లబ్. ఫ్యాకల్టీ అడ్వైజర్ డాక్టర్ ఈ.మధుసూదన్ రాజు, డాక్టర్ లింగస్వామి, ఆయా విభాగాల హెడ్‌లు విద్యార్థులను అభినందించారు.
అనేక ప్రయోజనాలు..
ప్రిన్సిపాల్ ప్రొ.శ్రీరాం వెంకటేష్ ఈ డ్రోన్ల గురించి వివరిస్తూ.. ఎలక్ట్రికల్ లిపియం పాలిమర్ బ్యాటరీస్‌తో రూ.40 వేలు వెచ్చించి 15 రోజులపాటు శ్రమించి రూపొందించిన ఈ డ్రోన్స్ జీపీఎస్ లొకేషన్ ద్వారా ఎలాంటి మానవ సంబంధం లేకుండా ఆకాశ మార్గంలో ప్రయాణిస్తాయని తెలిపారు. ఇక వివిద విపత్తులు, ఉపద్రవాల సమయంలో వస్తువులను సరఫరా చేస్తాయని చెప్పారు. కో ఆర్డినేటర్ ప్రొ.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. భవిష్యత్తులో అమెజాన్, ఫ్లిప్ కార్డ్ లాంటి సంస్థలు కూడా ఇలాంటి డ్రోన్స్ ద్వారా వస్తువులు డెలివరీ చేస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. కొన్ని సంవత్సరాలుగా ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకత, ఆలోచనల శక్తిని పెంపొందించి వారిని పరిశోధనల వైపుకు ప్రిన్సిపాల్, అధ్యాపకులు ప్రోత్సహిస్తున్నారు. దాంతో విద్యార్థులు దేశవ్యాప్తంగా జరిగే వివిధ పోటీల్లో పాల్గొని సత్తా చాటుతున్నారు.