మూఢ నమ్మకాల నిర్మూలన చట్టం తేవాలి

Abolition of superstitions should be enacted– వైజ్ఞానిక సభలో వక్తలు
– స్వేచ్ఛ జేఏసీ, మూఢ నమ్మకాల నిర్మూలన చట్ట సాధన సమితి ఆధ్వర్యంలో ప్రదర్శనలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో మూఢ నమ్మకాల నిర్మూలన చట్టం తేవాలని పలువురు వక్తలు డిమాండ్‌ చేశారు. డాక్టర్‌ నరేంద్ర దభోల్కర్‌ పదో వర్థంతి సందర్భంగా స్వేచ్ఛ జేఏసీ, మూఢ నమ్మకాల నిర్మూలన చట్ట సాధన సమితి సంయుక్తాధ్వర్యంలో ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద ప్రదర్శనలు, వైజ్ఞానిక సభ నిర్వహించారు. మతోన్మాదుల చేతుల్లో హత్యలకు గురైన డాక్టర్‌ నరేంద్ర దభోల్కర్‌, డాక్టర్‌ గోవింద్‌ పన్సారి, ప్రొఫెసర్‌ కల్బుర్గి, జర్నలిస్ట్‌ గౌరీ లంకేష్‌లకు జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా ప్రజల మూఢ నమ్మకాలను ఆసరా చేసుకుని కొంత మంది చేస్తున్న మోసాలను బట్టబయలు చేసే విధంగా ప్రదర్శనలు నిర్వహించారు. ముందుగా సుందరయ్య పార్కు చుట్టూ విజ్ఞాన దర్శిని రమేశ్‌ వీపునకు కొక్కాలతో కారును లాగారు. అనంతరం విజ్ఞాన దర్శినీ నాయకులు బాల నారాయణ, విష్ణువర్థన్‌లు తొలిసారిగా అదే విధంగా కారును విజయవంతంగా లాగుతూ ప్రదర్శించారు. మంటలపై నడిచి మూఢ నమ్మకాల నుంచి బయటపడాలని పిలుపునిచ్చారు. తర్వాత సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన వైజ్ఞానిక సభలో పలు అంశాలను ప్రదర్శించి దాని వెనుక దాగి ఉన్న వైజ్ఞానిక సూత్రాలను వివరించారు. నీరు పెట్రోల్‌గా మారడం, ఒంటికి మంటలంటుకోకపోవడం, నోట్లో మంటలు పెట్టుకోవడం, మట్టిపై నీళ్లు పోస్తే మంటలు రావడం, నీరు ఎర్రగా మారడం, గాజు పెంకులపై నడవడం వంటివి ప్రదర్శనలు చేశారు. ఈ సందర్భంగా పలువురు పెద్దలు, చిన్నారులు ప్రదర్శనల్లో భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా విజ్ఞాన దర్శిని రమేశ్‌ మాట్లాడుతూ పలు రాష్ట్రాల్లో చట్టాలను అధ్యయనం చేసి రూపొందించిన మూఢ నమ్మకాల నిర్మూలన చట్టం ముసాయిదాను చూసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం వద్ద సమయం లేదని విమర్శించారు. ఒకే కులంలో వివాహాల ద్వారా జన్యుపరమైన రోగాలు వస్తున్నాయని సీసీఎంబీ పరిశోధనల్లో తేలిందని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి రోగాల బారిన పడకుండా కులాంతర వివాహాలు పెరగాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు.
ఈ సమావేశంలో స్వేచ్ఛ జేఏసీ కన్వీనర్‌ శంకర్‌, గుత్తా జ్యోత్స్న, రాచకొండ రమేశ్‌, జ్యోతి తదితరులు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలనీ, సమాజం ఇంకా నష్టపోకముందే చట్టం తీసుకురావాలని కోరారు.

Spread the love