అనుమతిలేకుండా కోచింగ్ సెంటర్లు
నీట్, ఐఐటీ పేరుతో
రూ.లక్షల్లో దోపిడీ
పట్టించుకోని విద్యాశాఖ
తమకు సంబంధం లేదంటున్న డీఐఈవో, డీఈవో
2019 నుంచి నిలిచిన
కాలేజీల అనుమతులు
నవతెలంగాణ –
ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
నీట్, జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌డ్, ఐఐటీ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా అడ్డగోలు అకాడమీలు పుట్టుకొస్తున్నాయి. మాయమాటలతో తల్లిదండ్రులను బురిడీ కొట్టించి విచ్చలవిడి ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రధాన నగరాల్లో అకాడమీల పేరుతో ఇంటర్ చదువును వ్యాపారంగా మార్చుతున్నారు. ఎడ్యుకేషన్ సొసైటీలు, కోచింగ్ సెంటర్ల పేరిట విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఇంటర్ బోర్డు, విద్యాశాఖ అనుమతి లేకుండా ఐఐటీ, జేఈఈ, నీట్ అకాడమీలు వెలుస్తున్నాయి. రూ. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ సామాన్యుల జేబులు గుల్ల చేస్తున్నారు. భారీ హోర్డింగులతో ప్రచారం చేస్తూ బురిడీ కొట్టిస్తున్నారు. ఐఐటీ, నీట్, ఎమ్ సెట్ అకాడమీలు ఇంటర్ బోర్డు పరిధిలోకి రావని బోర్డు అధికారులు చెబుతున్నారు. వాటిపై ఎలాంటి చర్యలు తీసుకునే అధికారం తమకు లేదని అంటున్నారు. అటువంటి అకాడమీల్లో చేరి మోసపోవద్దని, తల్లిదండ్రులు జాగ్రత్తగా పరిశీలించి అనుమతి ఉన్న కళాశాలల్లో చేర్పించాలని సూచిస్తున్నారు. ఇటీవల రాష్ట్రంలో పలుచోట్ల సదరు పరీక్షల కోచింగ్ సెంటర్లు, అకాడమీలకు ఇంటర్ బోర్డు నుంచి నోటీసులు అందాయి. కానీ చర్యల విషయంలో ఇంటర్ బోర్డు అధికారులు వెనకాడుతుండటం గమనార్హం.
అనుమతి అధోగతి
2019 నుంచి రాష్ట్రంలో ఏ ఒక్క ఇంటర్మీడియట్ కాలేజీకి అనుమతి ఇవ్వలేదు. కనీసం కాలేజీల పేర్ల మార్పిడికి కూడా పర్మిషన్ లేదు. కళాశాలల షిఫ్టింగ్ పర్మిషన్స్ కూడా లేవు. అయినప్పటికీ అకాడమీలు, కాలేజీలు వెలుస్తుండటం చర్చనీయాంశం అవుతోంది. అకాడమీల్లో ఎక్కడా ఇంటర్మీడియట్ బోధన చేయరాదనే నిబంధన ఉంది. అనుభవజ్ఞులైన, సరైన విద్యార్హతులున్న లెక్చరర్లు, వారికి సంబంధించిన అర్హత సర్టిఫికేట్లు బోర్డుకు సమర్పించాల్సి ఉంటుంది. కానీ ఇటువంటి ప్రమాణాలేవీ పాటించకుండా అకాడమీలను నిర్వహిస్తుండటం వివాదాస్పదమవుతోంది. ప్రభుత్వం అకాడమీలను జిల్లా విద్యాశాఖ అధికారి పరిధిలోకి తీసుకొచ్చింది. కానీ దీనిపై డీఈవోలకు స్పష్టమైన ఆదేశాలు సైతం లేవు. అటు ఇంటర్ బోర్డు పరిధిలోకీ రాక.. ఇటు పాఠశాల విద్యాశాఖ పరిధిలోకి రాకపోవడంతో అకాడమీల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఏదో ఒక గుర్తింపు పొందిన కళాశాల నుంచి పరీక్షలు రాయిస్తూ ఆ కళాశాల కంటే కూడా అదనంగా ఫీజులు వసూలు చేస్తున్నారు.
కనీస వసతులు లేకున్నా రూ. లక్షల్లో ఫీజులు
ఈ అకాడమీల్లో కనీస వసతులు లేకున్నా రూ. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. ఏ అకాడమీలో చూసినా రూ. లక్షకు తక్కువ ఫీజు ఎక్కడా లేదు. అనుమతులు లేకున్నా లాంగ్ టర్మ్ కోచింగులు ఇస్తూ ఏడాదికి డే స్కాలర్‌కు రూ.లక్షన్నర వరకూ దండుకుంటున్నారు. హాస్టల్ కమ్ ఇంటర్మీడియట్ సెకండియరైతే రూ.3 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. అయినా ఏ ఒక్కరూ అడిగే పరిస్థితి ఉండటం లేదు. ఏ బోర్డుకూ ఈ అకాడమీలపై అజమాయిషీ లేదు.
ఎంఈవోల నివేదికలో
అకాడమీల బాగోతం వెల్లడి
రాష్ట్రంలోని పలు నగరాల్లో 100కు పైగా కోచింగ్ సెంటర్లు, అకాడమీలు విద్యాశాఖ అనుమతి లేకుండా నడుస్తున్నాయని ఇటీవల ఎంఈవోల రహస్య సర్వే ద్వారా విద్యాశాఖ గుర్తించింది. చాలా సెంటర్లలో నవోదయ, కోరుకొండ, గురుకులం విద్యాలయాల ప్రవేశ పరీక్షకు శిక్షణ ఇచ్చే ట్యుటోరియల్స్ అనుమతి లేకుండా నడుస్తున్నా యని నివేదిక ఇచ్చారు. ఇంత జరుగుతున్నా పుట్టగొ డుగుల్లా వెలుస్తున్న అకాడమీలు మాత్రం తగ్గడం లేదు.
ఈ నిబంధనలు తప్పనిసరి
అకాడమీల్లో శిక్షణకు వచ్చే వారంతా కూర్చోవడానికి అనుకూలమైన కుర్చీలు, బల్లలు ఉండాలి. విశాలమైన శిక్షణ గదులు, గాలి, వెలుతురు, విద్యుత్ సౌకర్యం కల్పించాలి. విద్యార్థులకు సరిపడా మూత్రశాలలు ఉండాలి. గ్రంథాలయం తప్పనిసరి. శిక్షకుల విద్యార్హతల సర్టిఫికెట్లు విద్యాశాఖ అధికారులకు అందుబాటులో ఉండాలి. బోధకుల విద్యార్హతల్లో తేడా ఉంటే చట్ట ప్రకారం చర్యలు తప్పవని పాఠశాల విద్యాశాఖ అదేశాలు అమలు చేయాలి.
విద్యార్థులు మోసపోవద్దు:
రవిబాబు, డీఐఈవో, ఖమ్మం
జిల్లాలో అనుమతిలేని అకాడమీలు, కోచింగ్ సెంటర్లలో ప్రవేశాలు పొంది విద్యార్థులు మోసపోవద్దు. ఏ అకాడమీకి ప్రభుత్వ గుర్తింపు లేదు. ప్రభుత్వ గుర్తింపు ఉన్న ఇంటర్ కళాశాలల్లోనే పిల్లలను చేర్పించాలి. కొన్ని అకాడమీలను ఇంటర్ కాలేజీ పేరుతో అనుమతులు తీసుకొని నిర్వహిస్తున్నారు. అటువంటి వాటిపై బోర్డు అజమాయిషీ ఉంటుంది.
అడ్డగోలు అకా’డమ్మీ’లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


