విద్యాసంస్థలలో అకాడమిక్ వాతావరణం నెలకొల్పాలి..

– యూనివర్సిటీ రిజిస్ట్రార్  ఎం.యాదగిరి..
నవతెలంగాణ -డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో అన్ని విద్యాసంస్థలలో అకాడమిక్ వాతావరణాన్ని నెలకొల్పాలని, కోవిడ్ కాలంలో విద్యావ్యవస్థ  తీవ్రంగా దెబ్బతిన్నదని  కళాశాల యజమానులు దార్శనికతతో దాన్ని పునరుద్ధరించాలని తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం యాదగిరి సూచించారు.బుదవారం తెలంగాణ యూనివర్సిటీలోని అనుబంధ కళాశాలల ప్రిన్సిపాల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం. యాదగిరి హాజరయ్యారు. ఈ సందర్భంగా సమావేశాన్ని ఉద్దేశించి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ యాదగిరి మాట్లాడుతూ.. యూనివర్సిటీ పరిధిలో అన్ని విద్యాసంస్థలలో అకాడమిక్ వాతావరణాన్ని నెలకొల్పాలని సూచించారు. అత్యంత క్రమశిక్షణతో నిర్వహించే తరగతి గది ప్రధాన భూమిక పోషిస్తుందని తరగతి గది ద్వారానే  విద్యార్థులలో విజ్ఞానంతో పాటు సామాజిక, నైతిక, ప్రజాస్వామ్య విలువలు పెంపొందించవచ్చునని సూచించారు. దీనికి విద్యార్థికి అధ్యాపకులకు తరగతి గదిలో ఆరోగ్యకరమైన సజీవ సంబంధాలు ఉండే వాతావరణాన్ని  ఏర్పాటు చేయాలని సూచించారు. కోవిడ్ కాలంలో విద్యావ్యవస్థ  తీవ్రంగా దెబ్బతిన్నదని  కళాశాల యజమానులు దార్శనికతతో దాన్ని పునరుద్ధరించాలని  పేర్కొన్నారు. ఈ విద్యా సంవత్సరంలో పూర్తిస్థాయి అర్హులైన విషయ నిపుణులను ఎంపిక చేసుకొని విశ్వవిద్యాలయం నుండి అనుమతి పొందాలని పేర్కొన్నారు. ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ గంటా చంద్రశేఖర్ మాట్లాడుతూ.. కళాశాలల బకాయిలను సకాలంలో చెల్లించాలని కళాశాలలో పటిష్టమైన ల్యాబ్, గ్రంథాలయ సౌకర్యాలను పునరుద్దించాలని పేర్కొన్నారు. ఈ విద్యా సంవత్సరంలో అకస్మాత్తుగా తనిఖీలు ఉంటాయని నిబంధనలు పాటించని కళాశాలపై కఠిన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జాయింట్ డైరెక్టర్  డాక్టర్. అతిక్ సుల్తాన్ గోరితో పాటు  యూనివర్సిటీ పరిధిలోని 60కి పైగా కళాశాలల ప్రిన్సిపాల్ లు తదితరులు పాల్గొన్నారు.
Spread the love