యూనివర్సిటీ విద్యార్థినిపై ర్యాగింగ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి.. 

– విద్యార్థిపై దాడి చేసిన వారిపై చర్యలు చేపట్టాలి..
– పిడిఎస్ యూ- ఎస్ఎఫ్ఐ డిమాండ్..
నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థినిపై ర్యాగింగ్ చేసిన,ఒక విద్యార్థి పై భౌతికంగా దాడి చేసిన సంతోష్ ,శివ, నవీన్ లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ యాదగిరి  కి పిడిఎస్ యూ -ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం వినతి పత్రం అందజేశారు.  ఈ సందర్భంగా పిడిఎస్ యూ నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి కర్క గణేష్, ఎస్ ఎఫ్ఐ యూనివర్సిటీ అధ్యక్షులు ఎల్ ప్రసాద్ లు మాట్లాడుతూ.. తెలంగాణ యూనివర్సిటీ అనేక వివాదాలకు ఇప్పటికే కేంద్ర బిందువు అయిందని, యూనివర్సిటీ ప్రతిష్ట మసక బారిందని, ఇప్పుడు అదనంగా విద్యార్థులపై దాడులు చేసే సంస్కృతి ఇటీవల తరచుగా జరుగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ యూనివర్సిటీకి ఉన్నత విద్య అభ్యసించడానికి వివిధ జిల్లాల నుండి విద్యార్థులు వస్తారని,  దూర ప్రాంతాలు, ఇతర జిల్లాల నుండి వచ్చిన విద్యార్థులే హాస్టళ్ళల్లో ఉంటున్నారని తెలిపారు.  ఇటీవల కాలంలో యూనివర్సిటీ హాస్టల్లో విద్యార్థులపై కొద్దిమంది భౌతిక దాడులు చేసిన ఘటనలు తరచుగా జరుగుతున్నాయని అన్నారు. అయినప్పటికీ విటన్నింటిని నివారించే ప్రయత్నాలు జరగలేదని, తాజాగా బాలుర హాస్టల్లో న్యాయశాస్త్రం చదువుతున్న రాము అనే విద్యార్థిపై  యూనివర్సిటీలోనీ క్రిడ మైదానం లో మద్యం సేవించి సంతోష్ ( అప్లైడ్ ఎకనామిక్స్ ), శివ, నవీన్ అనే విద్యార్తులు చేయి చేసుకున్నారని వారన్నారు. హాస్టల్లో విద్యార్థుల ముందే బెదిరించి కొట్టారని అన్నారు. సంతోష్, శివ, నవీన్ ల పై చర్యలు తీసుకోవాలని, తనకు రక్షణ కల్పించాలని డిచ్ పల్లి పోలీస్ స్టేషన్లో రాము ఫిర్యాదు చేశారని వివరించారు. అదేవిధంగా యూనివర్సిటీ లోని మహిళా హాస్టల్ విద్యార్థిని వారికి వ్యతిరేకంగా వ్యవహరిస్తుందని, మధ్యాహ్నం సమయంలో సంతోష్, శివ, నవీన్ తదితరులు కొద్దిమంది విద్యార్థులను వెంటేసుకుని మహిళా హాస్టల్ వద్దకెళ్లి, పీజీ ఎకనామిక్స్ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థినిని పిలిపించుకొని బెదిరించారని పేర్కొన్నారు. ఆ అమ్మాయిని  భయభ్రాంతులకు గురిచేసి అందరి ముందు క్షమాపణ చెప్పించుకున్నారని అన్నారు. ఇది చాలా సీరియస్ విషయమని,ఈ విషయమై బాధిత విద్యార్థిని డిచ్ పల్లి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ కు ఫిర్యాదు చేసిందని తెలిపారు.
    ఇంత జరుగుతున్న యూనివర్సిటీ అధికారులు, పోలీసులు ఈ ఘటనలపై దర్యాప్తు జరిపి, ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటన్నారు. విద్యార్థుల్ని కొట్టి, భయభ్రాంతులకు గురిచేసిన వారికే, యూనివర్సిటీ అధికారులు వత్తాసు పలుకుతున్నారని  బలంగా ఇతర విద్యార్థులు విశ్వసిస్తున్నారన్నారు. ఇది అత్యంత బాధాకరమైన విషయమని, ఇప్పటికైనా ఈ ఘటనలపై యూనివర్సిటీ అధికారులు వెంటనే దర్యాప్తు జరిపి సంతోష్ శివ, నవీన్ లపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్ యూ నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్. కె. అశూర్, యూనివర్సిటీ ఎస్ ఎఫ్ ఐ ఉపాధ్యక్షులు వెంకటేష్, నాయకులు చిత్రు, దినేశ్ లు పాల్గొన్నారు.
Spread the love