ఆర్‌టిఐ ప్రకారం ఆ బాండ్ల వివరాలు వెల్లడించలేం

నవతెలంగాణ – న్యూఢిల్లీ : ఎన్నికల కమిషన్‌ (ఇసి)కి అందించిన ఎలక్టోరల్‌ బాండ్ల వివరాలను ఆర్‌టిఐ చట్టం కింద వెల్లడించేందుకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ) నిరాకరించింది. ఎలక్టోరల్‌ బాండ్ల వివరాలు ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో పబ్లిక్‌ డొమైన్‌లో ఉన్నప్పటికీ.. వ్యక్తిగత సమాచారం విశ్వసనీయమైదని ఎస్‌బిఐ తెలిపింది. వ్యక్తిగత సమాచారాన్ని వెల్లడించలేమన్నది. సుప్రీం ఆదేశాలతో ఇసికి సమర్పించిన వివరాలకు చెందిన డిజిటల్‌ డేటాను కోరుతూ ఆర్‌టిఐ కార్యకర్త కమోడోర్‌ (రిటైర్డ్‌) లోకేశ్‌ బాత్రా ఎస్‌బిఐకి దరఖాస్తు చేశారు. సమాచార హక్కు చట్టం (ఆర్‌టిఐ) కింద సమచారం ఇచ్చేందుకు ఎస్‌బిఐ తిరస్కరించింది. ఆర్‌టిఐ చట్టంలోని సెక్షన్‌8(1)(ఇ), సెక్షన్‌ 8(1)(జే) ప్రకారం విశ్వసనీయ, వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం చేయబోమని ఎస్‌బిఐ తెలిపింది. ఎలక్టోరల్‌ బాండ్లు కొన్నవారి, రాజకీయ పార్టీల సమాచారాన్ని వెల్లడించడం ఆ చట్టాల ప్రకారం నేరం అవుతుందని వెల్లడించింది. అలాగే ఎలక్టోరల్‌ బాండ్లపై సుప్రీంకోర్టులో కేసును వాదించేందుకు సీనియర్‌ న్యాయవాది హరీశ్‌ సాల్వేకు ఎస్‌బిఐ చెల్లించిన ఫీజు వివరాలను కూడా అందించాలని బాత్రా కోరారు. ఇప్పటికే ఇసి వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారాన్ని ఎస్‌బిఐ తిరస్కరించడం దారుణమని బాత్రా పేర్కొన్నారు. సాల్వే ఫీజు గురించి అడిగిన ప్రశ్నకు, పన్ను చెల్లింపుదారుల నగదుకు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వలేమని బ్యాంక్‌ తిరస్కరించిందని ఆయన తెలిపారు. ఎలక్టోరల్‌ బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధం, ఏకపక్షమని పేర్కొంటూ ఫిబ్రవరి 15న సుప్రీంకోర్టు తీర్పులో వెల్లడించింది. 2019 నుండి కొనుగోలు చేసిన ఎలక్టోరల్‌ బాండ్ల వివరాలను ఇసికి అందించాలని ఆదేశించింది. ఆ వివరాలను ఇసి తన వెబ్‌సైట్‌లో మార్చి 13 నుండి అంబుబాటులో ఉంచింది.

Spread the love