నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
ఈనెల 14 న భువనగిరి బాలసదనం లో జరిగిన సంఘటనను వారంరోజుల పాటు దాచి పెట్టిన ముగ్గురిపై చర్యలు తీసుకోవాలని సోమవారం జిల్లా కలెక్టర్ హనుమంతు కే జండగే కు బాలల హక్కుల కార్యకర్త కొడారి వెంకటేష్, హైమన్ రైట్స్ కమిషన్ జిల్లా అధ్యక్షులు ఎం డి ఇస్తియాక్ , సామాజిక ఉద్యమ నాయకులు పాక జహంగీర్ లు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాలసదనం లో జరిగిన సంఘటన డి సి పి ఓ, సిడబ్ల్యుసి చైర్మన్, బాలసదనం సూపరింటెండెంట్ లకు అదే రోజు తెలిసినా, అట్టి విషయాన్ని బయటకు పొక్కకుండా ఉద్దేశ్యపూర్వకంగానే వారం రోజుల పాటు దాచి పెట్టారని వారు ఆరోపించారు. జిల్లా బాలల పరిరక్షణ అధికారి సైదులు ,బాలల పరిరక్షణ సమితి చైర్మన్ జయశ్రీ , మరియు బాలసదనం సూపరింటెండెంట్ లలిత లను సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. బాలికకు జరిగిన అన్యాయాన్ని బయటకు రాకుండా, మెడికల్ సాక్ష్యాధారాలు లేకుండా అధికారులు ప్రయత్నం చేసారని వారు ఆరోపించారు. జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని సంబంధిత అధికారులను విధులనుండి తొలగించాలని వారు కలెక్టర్ ను కోరారు.