పోలింగ్ కేంద్రాల్లో కనీసం సౌకర్యాలు కల్పించాలి: అదనపు కలెక్టర్ వేణుగోపాల్

నవతెలంగాణ – అశ్వారావుపేట
త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు అవసరమైన కనీస సౌకర్యాలు కల్పించాలని జిల్లా అదనపు కలెక్టర్, అసిస్టెంట్ ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ వేణు గోపాల్ సెక్టార్ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా దివ్యాంగులు,వృద్ధుల కోసం ర్యాంపు లు, తాగునీరు, విద్యుత్ సౌకర్యం పూర్తి స్థాయిలో ఉండాలని చెప్పారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కనీస సౌకర్యాలపై ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని, ఓటర్లకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల ప్రాముఖ్యత పై ప్రజల్లో అవగాహన కల్పించేలా ప్రధాన కూడలి లో, ప్రహరీ పై నినాదాలు, చిత్రాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రతి బూత్ స్థాయి అధికార ఓటర్లకు ఓటు సమాచార పత్రాలను రాజకీయ జోక్యం లేకుండా అందించాలని స్పష్టం చేశారు. దివ్యాంగులు, 85 ఏళ్ళు పైబడిన వృద్ధులకు ఇంటి వద్ద నుండే ఓటు వేసే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించిందని, ఆ మేరకు తహశీల్దారు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. అనంతరం రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టును తనిఖీ చేశారు. విధులు నిర్వహిస్తున్న అధికారుల నుండి మద్యం, నగదు అక్రమ రవాణాపై మద్యం, నగదు అక్రమ రవాణాపై నిఘాను మరింత పటిష్టం చేయాలని సూచించారు. సమావేశంలో నియోజక వర్గ మండలాల తహశీల్దార్లు, ఎన్నికల నయాబ్ తహశీల్దార్లు సెక్టార్ ఆఫీసర్లుపాల్గొన్నారు.
Spread the love