అవనిగడ్డలో వైసిపి ర్యాలీలో అపశ్రుతి

నవతెలంగాణ – అవనిగడ్డ: కృష్ణా జిల్లా అవనిగడ్డలో వైసిపి అభ్యర్థి సింహాద్రి రమేశ్‌ బాబు నామినేషన్‌ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో అపశ్రుతి చోటు చేసుకుంది. బాణసంచా నిప్పురవ్వలు పడి టిడిపి కార్యకర్త ఇల్లు దగ్ధమైంది. అయితే, ఈ ఘటన యాదఅచ్ఛికంగా జరిగిందా? లేక కక్షపూరితంగా చేశారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. అవనిగడ్డ ప్రధాన రహదారికి సమీపంలో టిడిపి కార్యకర్త యాసం వెంకటేశ్వరరావు, అతని పెదనాన్న కుటుంబసభ్యులు కలిసి ఒకే ఇంట్లో నివాసముంటున్నారు. ఆ ఇల్లు ప్రభుత్వ స్థలంలో ఉందని, గత రెండేళ్లుగా ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు వైసిపి నాయకుల ప్రోద్భలంతో గ్రామపంచాయితీ, రెవెన్యూ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆ స్థలంలో ఉన్న మరుగుదొడ్లు తొలగించారు. దీంతో వెంకటేశ్వరరావు హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. కోర్టు స్టే ఇచ్చిన తర్వాత కూడా స్థలం స్వాధీనం చేసుకునేందుకు రెండు సార్లు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో బుధవారం వైసిపి ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్‌ బాబు నామినేషన్‌ ర్యాలీ సందర్భంగా వైసిపి శ్రేణులు కాల్చిన బాణసంచా ఆ ఇంటిపై పడి పూర్తిగా కాలిపోయింది. ఇంట్లో ఉన్న రూ.2లక్షల విలువైన గ్రానైట్‌, టైల్స్‌, ఏడు తులాల బంగారం, రెండు కుటుంబాలకు చెందిన ఫర్నిచర్‌ పూర్తిగా కాలిపోయాయి. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలు అదుపు చేశారు.

Spread the love