ఇష్టారీతిన వెలుస్తున్న అక్రమ వెంచర్లు
పట్టించుకోని సంబంధించిన అధికారులు
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైనా తాడిచెర్ల, మల్లారం, పెద్దతూండ్ల గ్రామాల్లో పంట పొలాలు ప్లాట్లుగా మారుతున్నాయి. పలువురు అక్రమదారులు భూముల కన్వర్షన్ లేకుండా పోలాలను ప్లాట్స్ చేసి బహిరంగంగానే విక్రయాలు చేపడుతుండగా ప్రజలకు ఇబ్బందులు ఉంటాయని తెలియక కొనుగోలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా పట్టించు కోవాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. లక్షల రూపాయాలు వెచ్చించి కొనుగోలు చేసిన బాధితులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంటుందని తెలుస్తోంది.
మండలంలో ఉన్న వెంచర్లలో నిబంధనలు పాటించడం లేదు. అయిన అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తిన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో రియల్టర్లు రెచ్చిపోతున్నారు. లే అవుట్ లేకుండా ప్లాట్లను విక్రయిస్తున్నారు. కానీ రెవెన్యూ శాఖ అటు వైపు తొంగి చూడటం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. సంబంధించిన అధికారులు మాకేందుకులే అన్నట్లుగా వదిలేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో పంచాయతీకి ఆదాయం పోవటంతో పాటు, ప్రజలు ఆ స్థలాలలో ఇళ్లను నిర్మించాలంటే ఇబ్బందులు తప్పవని చెప్పటంలేదు. రైతు ముసుగులో రియల్టర్లు దర్జాగా వ్యాపారం చేస్తున్నా పట్టించుకోవటం లేదు.



