వసతి గృహ అధికారిని అహల్య ను సస్పెండ్ చేసిన కలెక్టర్

 – విధుల పట్ల నిర్లక్ష్యంపై వేటు

– వసతి గృహాల నిర్వహణ పట్ల నిర్లక్ష్యం విడాలని సూచన

నవతెలంగాణ నల్గొండ కలెక్టరేట్:  నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని ప్రీ మెట్రిక్ గిరిజన సంక్షేమ బాలికల వసతిగృహం అధికారిణి ఎం. అహల్యను జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి సస్పెండ్ చేశారు. సోమవారం ఆమె తన చాంబర్ లో సంక్షేమ శాఖల అధికారులతో వసతి గృహాల నిర్వహణ,సంక్షేమ శాఖల పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా విషయాన్ని వెల్లడించి ఆమె మాట్లాడారు. సంక్షేమ వసతి గృహాలలోని విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనంతో పాటు, అన్ని సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన అధికారులను ఆదేశించారు.జిల్లాలోని అన్ని సంక్షేమ హాస్టళ్లలోని విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని, అదేవిధంగా ఇతర సౌకర్యాలన్నీ కల్పించాలని అన్నారు. అయితే మిర్యాలగూడ ప్రీ మెట్రిక్ గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహం అధికారిణి ఎం.అహల్య హాస్టల్లో ఉండకపోవడమే కాకుండా, విద్యార్థినులకు భోజనం సరిగా పెట్టకపోవడంపై ఆమెను సస్పెండ్ చేసినట్టు వివరించారు. హాస్టల్ ను తనిఖీ చేసిన అనంతరం ఈ చర్య తీసుకున్నట్లు ఆమె తెలిపారు. హాస్టళ్ల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే తగు చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఇన్చార్జ్ అధికారి, గృహ నిర్మాణ శాఖ పిడి రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love