Saturday, July 4, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం6,7 తేదీల్లో హైదరాబాద్ లో ఏఐఎస్ జీపీఎఫ్ జాతీయ కాన్ఫరెన్స్ సమావేశాలు

6,7 తేదీల్లో హైదరాబాద్ లో ఏఐఎస్ జీపీఎఫ్ జాతీయ కాన్ఫరెన్స్ సమావేశాలు

- Advertisement -

టాప్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు
పి.నారాయణ రెడ్డి, పి.కృష్ణమూర్తి


​నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్

ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ ఫెడరేషన్ (ఏఐఎస్ జీపీఎఫ్ ) జాతీయ కాన్ఫరెన్స్ సమావేశాలు ఈ నెల 6,7 తేదీల్లో హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరగనున్నాయని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ (టాప్ర) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.నారాయణ రెడ్డి, పి.కృష్ణమూర్తి తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ లోని టాప్ర రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కాన్ఫరెన్స్ సమావేశాలకు టాప్ర ఆతిథ్యం ఇస్తున్నదనీ, 15 రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజరు కానున్నారని తెలిపారు. ఇది వరకే ఫోరం ఆఫ్ సివిల్ పెన్షనర్స్ అసోసియేషన్స్ ఏర్పాటైందనీ, అందులో రాష్ట్ర, కేంద్ర, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పెన్షనర్లు జాతీయ కమిటీలో ఉన్నారని తెలిపారు. అంతర్జాతీయంగా పెన్షన్ రద్దు విధానాలు పెరిగిపోతూ, మోడీ ప్రభుత్వం సైతం పెన్షనర్ల వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న ప్రస్తుత తరుణంలో కర్తవ్యాలను నిర్ణయించుకోవాల్సిన అవసరముందని తెలిపారు. కాన్ఫరెన్స్ సమావేశాల ఉద్దేశాలను వారు వివరించారు. కాన్ఫరెన్స్ సమావేశాల్లో దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలోని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సమస్యలపై కార్యాచరణ నిర్ణయించుకోనున్నారు. ముఖ్యంగా దేశంలోని వివిధ రాష్ట్రాలలో అమలవుతున్న ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య పథకాల గురించి చర్చించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం ఒక సమగ్ర ఆరోగ్య పథకం ఎలా ఉండాలనేది నిర్ణయించి దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు ప్రాతినిధ్యం చేయనున్నారు.

అదేవిధంగా సీపీఎస్ పెన్షన్ విధానం స్థానంలో పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించడానికి, కమ్యూటేషన్ రికవరీ కాలాన్ని 15 ఏండ్ల నుంచి 11 ఏండ్లకు తగ్గించడానికి, ఉద్యోగ విరమణ అనంతరం పెన్షనర్లు గౌరవప్రదమైన జీవితం గడపడానికి కావలసిన పరిస్థితులను కల్పించుకోవడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించనున్నారు. ఈ సమావేశాలలో తీసుకునే కర్తవ్యాలపై చర్చించేందుకు ఏఐఎస్ జీపీఎఫ్ జాతీయ అధ్యక్షులు సురేంద్ర చౌదరి, ప్రధాన కార్యదర్శి వజీర్ సింగ్, కోశాధికారి అరుణ ఘోష్, ఏఐఎస్ జీఎంఎఫ్ ప్రధాన కార్యదర్శి ఎ.శ్రీకుమార్, టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చావ రవి, వివిధ ప్రజా, ఉద్యోగ సంఘాల నాయకులు ఎం. జగదీశ్వర్, ఇ. శ్రీనివాస రావు, ఎండి. ముజీబ్, ఎంఎస్ రెడ్డి తదితర నాయకులు 7న సుందరయ్య కళానిలయంలో మధ్యాహ్నం 2 గం. నుండి 5 గం.ల వరకు జరిగే బహిరంగ సభలో సందేశాలు ఇవ్వనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలోని పెన్షనర్లందరూ ఈ బహిరంగ సభకు పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు. ఈ సమావేశంలో కాన్ఫరెన్స్ సమావేశాల ఆహ్వాన సంఘం అధ్యక్షులు డాక్టర్ లింగ అరుణ, కన్వీనర్ డాక్టర్ బి. స్వరాజ్ కుమార్, కోశాధికారి ఎస్.వై.కొండల రావుతో పాటు టాప్ర కోశాధికారి జె.అశోక్, డిప్యూటీ సెక్రెటరీ రామచంద్రుడు, కార్యదర్శులు ఎం.కృష్ణారావు, ఎన్.రమేశ్, జి.నర్సింగరావు, సి.కమల కుమారి, రాజకుమారి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -