– తృటిలో తప్పిన ముప్పు..
అజ్మీర్: రాజస్థాన్లోని అజ్మీర్ నగర సమీపంలో తృటిలో ఘోర రైలు ప్రమాదం తప్పింది. సేఫ్టీ బ్రేకులు పట్టేయడంతో అజ్మీర్-సిల్దా ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పి పక్కకు దూసుకెళ్లింది. మొత్తం నాలుగు బోగీలు పట్టాల పైనుంచి పక్కకు వెళ్లాయి. సోమవారం ఉదయం 8 గంటలకు మదర్ రైల్వే యార్డ్ దగ్గర ఈ ప్రమాదం చోటుచేసుకుందని అధికారులు తెలిపారు. పట్టాలు తప్పిన నాలుగు బోగీలు బోల్తాపడితే ఘోరం జరిగేదని, బోల్తా పడకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని నార్త్-వెస్టర్న్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ శశికిరణ్ చెప్పారు. ప్రస్తుతం రైల్వే అధికారులు, డీఆర్ఎం ఘటనా స్థలంలో ఉన్నారని, పట్టాలు తప్పిన నాలుగు బోగీలను తిరిగి ట్రాక్ పైకి ఎక్కించే పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం గానీ, ఎవరికీ ఎలాంటి గాయాలు గానీ కాలేదని తెలిపారు.