ఈనెల 12న ఆల్బెండజోల్ టాబ్లెట్స్ పంపిణీ చేయాలి

– జిల్లా కలెక్టర్ హనుమంతు కె జండాగే
నవతెలంగాణ –  భువనగిరి రూరల్ 
ఒకటి నుండి 19 సంవత్సరముల వయస్సు గల పిల్లలందరికి ఈనెల 12 న ఆల్బండజోల్ టాబ్లెట్స్ వేయాలని, వంద శాతం లక్ష్యాన్ని సాధించాలని జిల్లా కలెక్టరు హనుమంతు కే జెండగే అధికారులను ఆదేశించారు. ఈనెల 12 న జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని, బుధవారం నాడు కాన్పరెన్స్ హాలులో వైద్య, విద్య, మహిళా శిశు సంక్షేమం, పంచాయితీరాజ్, సంక్షేమ శాఖల అధికారులతో కూడిన జిల్లా టాస్క్ ఫోర్సు కమిటీ సమావేశం జిల్లా కలెక్టరు అధ్యక్షతన నిర్వహించగా, తన ముఖ్య అతిథిగా హాజరై,  మాట్లాడారు.  జాతీయ నులి పురుగుల దినోత్సవం రోజున 21 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 901 అంగన్వాడీ కేంద్రాలు, 647 ప్రభుత్వ పాఠశాలలు, 146 ప్రయివేటు పాఠశాలలు, 38 ప్రభుత్వ, ఎయిడెడ్ జూనియర్ కాలేజీలు, 26 ప్రయివేటు జూనియర్ కళాశాలలకు సంబంధించి మొత్తం ఒక లక్షా 61 వేల 650 మంది పిల్లలకు ఆల్బెండజోల్ టాబ్లెట్స్ వేయడానికి అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని తెలిపారు. ఒక వేళ ఆరోజు ఎవరైనా వేసుకోని పిల్లలు ఉంటే తిరిగి వారికి మాపప్ రౌండ్ లో ఈనెల 19 తేదీన వేయాలని తెలిపారు. సంబంధిత శాఖలు నోడల్ అధికారులను ఏర్పాటు చేసుకోవాలని, తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆల్బెండజోల్ టాబ్లెట్స్ వేయించేలా అవగాహన కలిగించాలని, గ్రామాలలో టామ్ టామ్ ద్వారా తెలియచెప్పాలని, ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని అన్నారు. అన్ని పాఠశాలలు, జూనియర్ కాలేజీలు, అంగన్వాడీ కేంద్రాలలో వంద శాతం పిల్లలకు టాబ్లెట్స్ వేసేలా కార్యాచరణ ఉండాలని, ఆరోజు పిల్లలు తప్పనిసరిగా హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నులిపురుగుల నివారణతోనే సంపూర్ణ ఆరోగ్యమని, చిన్నారులలో అనారోగ్య సమస్యలకు కారణమవుతున్న నులిపురుగులను నివారించి ఆరోగ్యాన్ని మెరుగుపరచేందుకు ప్రతి సంవత్సరం రెండు విడతలుగా ఫిబ్రవరి, ఆగష్టు మాసాలలో నివారణ దినోత్సవాలను నిర్వహించడం జరుగుతున్నదన్నారు. ఒకటి నుండి 2 సంవత్సరాల పిల్లలకు సగం టాబ్లెట్, 2 నుండి 19 సంవత్సరాల పిల్లలకు ఒక మాత్ర వేయాలన్నారు. పిల్లలకు మాత్ర వేయగానే తాగేందుకు తగిన త్రాగునీరు అందుబాటులో ఉంచాలని తెలిపారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో అన్ని జాగ్రత్తలు తీసుకొని వంద శాతం ఆల్బండజోల్ మాత్రలు వేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఇన్ఛార్జీ జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ యశోద, జిల్లా విద్యాశాఖ అధికారి కె.నారాయణరెడ్డి, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి అన్నపూర్ణ, జిల్లా పరిషత్ డిప్యూటీ సిఇఓ శ్రీనివాసరావు, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ వంశీకృష్ణ, డాక్టర్ వినోద్ లు  పాల్గొన్నారు.
Spread the love